నీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆందోళనలో పోలీసుల చర్యలపై  హై పవర్ కమిటీ 

నీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆందోళనలో పోలీసుల చర్యలపై  హై పవర్ కమిటీ 
  •  
  • రిటైర్డ్ జడ్జిలు, సీబీఐ మాజీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 
  • మాజీ డీజీపీతో ఏర్పాటుకు సుప్రీంకోర్టు నిర్ణయం
  •     విద్యార్థినులపై లైంగిక వేధింపులు, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ బెదిరింపులపైనా పరిశీలన 
  •     విద్యార్థులకు నిరసన తెలిపే రాజ్యాంగ హక్కు ఉన్నది
  •     కేసుల రద్దుకు ఆర్టికల్ 142 ప్రయోగిస్తామని సంకేతాలు
  •     విద్యార్థులపై దాడికి ఎవరు బాధ్యులైనా ఉపేక్షించేది లేదు: సీజేఐ
  •     ఆందోళనలో సంఘ విద్రోహ శక్తులు చేరాయని పోలీసుల అఫిడవిట్

న్యూఢిల్లీ, వెలుగు: నీట్‌‌‌‌ పేపర్ లీక్‌‌‌‌కు వ్యతిరేకంగా జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘చలో పార్లమెంట్’ మార్చ్ ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు, భద్రతా బలగాలపై విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలపై విచారణ జరిపేందుకు హైపవర్డ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈమేరకు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. నిరసనకారులపై పోలీసు చర్యకు వ్యతిరేకంగా కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే తాజా విచారణలో ప్యానెల్‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నట్టు కోర్టు వెల్లడించింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల రిటైర్డ్​ జడ్జీలు, రాష్ట్ర మాజీ డీజీపీ,  సీబీఐ మాజీ డైరెక్టర్‌‌‌‌తో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌‌‌‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. ఈ కమిటీ సభ్యుల వివరాలపై బుధవారం సమగ్ర ఉత్తర్వులు వెలువడనున్నాయి.

బాధితుల వాదనలు కమిటీ వింటుంది.. 

ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థినులపై జరిగిన లైంగిక వేధింపులు, సోషల్ మీడియా ద్వారా సాగిన ఆన్‌‌‌‌లైన్ బెదిరింపుల ఆరోపణలను కూడా ఈ కమిటీ నిశితంగా పరిశీలించనుందని సుప్రీంకోర్టు బెంచ్‌‌‌‌  స్పష్టం చేసింది. జులై 20 పార్లమెంట్ మార్చ్ సందర్భంగా జరిగిన ఘటనలకు సంబంధించిన పూర్తి సీసీటీవీ, వీడియో ఫుటేజీలను కమిటీకి తక్షణమే అప్పగించాలని ఆదేశించింది. ‘‘బాధిత విద్యార్థుల వాదనలను కమిటీ ప్రత్యక్షంగా వింటుంది. విద్యార్థులపై దాడికి ఎవరు బాధ్యులైనా ఉపేక్షించేది లేదు.. చట్టపరమైన చర్యలు తప్పవు” అని సీజేఐ స్పష్టం చేశారు. 

విద్యార్థులపై కేసులు రద్దు చేయాలి

నిరసనకారులైన విద్యార్థులపై పెట్టిన కేసులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కు విద్యార్థులకు ఉందని తేల్చిచెప్పింది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారిపై నమోదైన ఎఫ్ఐఆర్‌‌‌‌లను రద్దు చేయడానికి అవసరమైతే ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టుకున్న ప్రత్యేక అధికారాలను ప్రయోగిస్తామని సంకేతాలిచ్చింది. నిరసనకారుల గుర్తింపునకు పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, డిజిటల్ ట్రాకింగ్ వాడటం గోప్యతా హక్కు ఉల్లంఘనేనని పిటిషనర్లు లేవనెత్తిన అంశంపై ధర్మాసనం స్పందించింది. కమిటీ వాస్తవ నివేదికను మాత్రమే సమర్పిస్తుందని, నిఘా విధానాల రాజ్యాంగబద్ధతపై తామే తుది తీర్పు వెలువరిస్తామని బెంచ్​ స్పష్టం చేసింది.

శాంతియుత నిరసనల్లో కేసులు భిన్నం

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అఫిడవిట్లు సమర్పించారు. హత్య, అత్యాచారం, కిడ్నాప్ వంటి తీవ్రవమైన నేరాలకు పాల్పడిన 2873 మంది మినహా, మిగిలిన విద్యార్థులపై కేసులు కొట్టివేయవచ్చని అందులో పేర్కొన్నారు. అయితే, సంఘ విద్రోహ శక్తులపై విచారణ జరపాలని అభ్యర్థించారు. నిరసనకారులపై కేసులు ఉపసంహరణను అడ్వొకేట్ రిజ్వాన్ అహ్మద్ వ్యతిరేకించారు. ఈ విషయంలో విద్యార్థులు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని పట్టుబట్టారు. పార్లమెంట్ ముట్టడి చట్టవిరుద్దమని, అందులో పాల్గొన్న వారు బాధ్యత నుంచి తప్పించుకోలేరని నివేదించారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ... ‘అక్కడ విద్యార్థుల లక్ష్యం, ఏ ఉద్దేశంతో గుమిగూడారో, ఆ దృష్టితోనే నేర స్వభావాన్ని చూడాలి. ఆర్టికల్ 19 ప్రకారం.. వారికి రాజ్యంగం కల్పించిన హక్కును మర్చిపోకూడదు. చట్టాన్ని ఉల్లంఘించకుండా, శాంతియుతంగా గళాన్ని వినిపించినంత కాలం... ఆ కేసులు కఠిన నేరాల కేసుల కన్నా భిన్నమైనవి’ అని వ్యాఖ్యానించారు. ఇది అమాయక విద్యార్థుల జీవితం, భవిష్యత్ కు సంబంధించిన ప్రశ్న అన్నారు. ఎంత నిరసన వ్యక్తమైనప్పటికీ.. వ్యవస్థపై వారికి చట్టబద్ధమైన అంచనాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

ఆ గ్రూప్​లో సంఘ విద్రోహ శక్తులు..

‘చలో పార్లమెంట్’ ఆందోళనలో సంఘ విద్రోహ శక్తులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కలిసిపోయార ని పోలీసులు సుప్రీంకోర్టుకు నివేదించారు. బిహార్​లో జరిగిన ఆందోళనలో గుంపులో చిక్కుకోవడం తోనే కానిస్టేబుల్ ఏకే 47 తో గాల్లోకి కాల్పులు జరిపాడని తెలిపారు. ఈమేరకు ఢిల్లీ, బిహార్​కు చెందిన పోలీసులు వేర్వేరుగా సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. పార్లమెంట్ ముట్టడిలో విద్యార్థులపై పోలీసుల తీరును నిరసిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్​కు సంబంధించిన అంశమని అన్నారు. ఈ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లు కొట్టివేయాలన్న అభిప్రాయాన్ని బెంచ్ మరోసారి వ్యక్తంచేసింది. అయితే.. నిరసనల్లోకి చొరబడిన, గతంలో తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై ఉన్న కేసులు కొట్టివేయలేమని స్పష్టం చేసింది.