న్యూఢిల్లీ: పీఎం కేర్స్ ఫండ్‌కు దేశీయ, విదేశీ విరాళాలు భారీగా తగ్గాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ విరాళాలు 30 శాతం తగ్గి రూ.479 కోట్లకు పరిమితమయ్యాయి. అదే సమయంలో విదేశీ విరాళాలు కూడా18 శాతం క్షీణించి రూ.92.8 లక్షలకు పడిపోయాయి. తాజా ఆడిట్ రిపోర్టులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అయితే, మార్చి 31, 2025 నాటికి ఫండ్‌లోని మొత్తం నిల్వ రూ.8,452 కోట్లకు చేరింది.
ఈ నిధులలో రూ.7,846 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్లలో, మిగిలిన రూ.605 కోట్లను సేవింగ్స్ ఖాతాలలో భద్రపరిచారు. ఇక, 2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశీయ విరాళాలు రూ.681.8 కోట్లు, విదేశీ విరాళాలు రూ.1.13 కోట్లు వచ్చాయి. మరోవైపు, ఈ ఫండ్ నుంచి చేసే ఖర్చులు కూడా భారీగా తగ్గాయి.
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకానికి 2023–24లో రూ.15.37 కోట్లు వెచ్చించగా, 2024–25 నాటికి ఆ ఖర్చు రూ.87.8 లక్షలకు పడిపోయింది. దేశీయ విరాళాలు కరోనా సమయంలో అంటే 2020–-21లో అత్యధికంగా రూ.7,184 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత 2021-–22లో రూ. 1,896 కోట్లు, 2022-–23లో రూ.909 కోట్లకు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
