మన ఎన్నికల సిస్టంపై ట్రంప్ ప్రశంస  

మన ఎన్నికల సిస్టంపై ట్రంప్ ప్రశంస  
  •     ఎన్నికల నిర్వహణకు భారత్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని కామెంట్
  •     ఓటర్ ఐడీ వ్యవస్థపై సీఈసీ వ్యాఖ్యలను ప్రస్తావించిన అమెరికా ప్రెసిడెంట్

న్యూఢిల్లీ: భారతదేశ ఎన్నికల విధానాన్ని, ఓటర్ ఐడీ వ్యవస్థను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ప్రశంసించారు. అమెరికాలో కఠినమైన ఎన్నికల నిబంధనలను తీసుకురావడానికి భారత్ ఒక చక్కని ఉదాహరణ అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘సేవ్ అమెరికా యాక్ట్’ను ఆమోదించాలని కాంగ్రెస్‌‌‌‌పై ఒత్తిడి తెస్తూ.. ఓటర్ గుర్తింపుపై ఇటీవల సీఈసీ జ్ఞానేశ్​ కుమార్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ ప్రస్తావించారు.

తన సొంత సోషల్​మీడియా ట్రూత్ సోషల్ లో ఒక పోస్ట్‌‌‌‌లో.. అమెరికా ఫెడరల్ ఎన్నికలలో  ఫొటో ఐడీ లేకపోవడం గురించి అమెరికా ప్రభుత్వంతో భారత చీఫ్​ఎలక్షన్ ​కమిషనర్ జ్ఞానేశ్​ కుమార్ జరిపిన సంభాషణలోని వ్యాఖ్యలను ట్రంప్ గుర్తుచేశారు. ‘ అమెరికాలో ఎన్నికల నిర్వహణపై ఇటీవల భారత ​సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చెల్లుబాటు అయ్యే ఫొటో ఐడీ లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు’ అని ట్రంప్ వెల్లడించారు. భారతదేశంలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 64.6 కోట్ల (646 మిలియన్లు) మంది ఓటర్లు పాల్గొన్నారని.. అక్కడ 1% కన్నా తక్కువ మందే పోస్టల్ బ్యాలెట్‌‌‌‌ను వినియోగించారని ట్రంప్ గుర్తుచేశారు. ప్రతి ఓటరు వద్ద కచ్చితమైన ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్) ఉండటాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే, భారత ఎన్నికల వ్యవస్థను ఉదహరిస్తూ.. అమెరికా కాంగ్రెస్ వెంటనే ‘సేవ్ అమెరికా యాక్ట్’ను ఆమోదించాలని ట్రంప్ కోరారు. అమెరికా పౌరులు మాత్రమే దేశ ఎన్నికల్లో పాల్గొనేలా చూసేందుకు ఈ చట్టం ఎంతో అవసరమని ఆయన వాదిస్తున్నారు.