హింగోలి(మహారాష్ట్ర): ప్రభుత్వ బడులు మెరుగుపడాలంటే మంత్రులు, విద్యాశాఖ అధికారుల పిల్లలు కచ్చితంగా ప్రభుత్వ బడుల్లోనే చదివేలా నిబంధన విధించాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే డిమాండ్ చేశారు. గ్రామీణ విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గత వారం 'స్కూల్ ఠీక్ కరో' ప్రచారం ప్రారంభించిన ఆయన.. హింగోలి జిల్లా లింబాలాలో మంగళవారం మీడియాతో మాట్లాడారు.
గ్రామీణ విద్యార్థుల కష్టాలు మంత్రులకు తెలియాలంటే, వారి పిల్లలు కనీసం ఒక్క రోజైనా ప్రభుత్వ బడుల్లో చదవాలన్నారు. ఎన్నికల సభలకు బస్సులు, రైళ్లు ఏర్పాటు చేసే నాయకులు.. పేద విద్యార్థుల కోసం ఒక్క బస్సు కూడా ఇవ్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తరగతి గదిలో మద్యం తాగి నిద్రపోయిన జడ్పీ స్కూల్ హెచ్‌ఎంను సస్పెండ్ చేయించామని, కొత్త ఉపాధ్యాయుడు వచ్చే వరకు ఆయన గ్రామం వీడకూడదని స్పష్టం చేశారు. రెండేండ్లుగా విద్యార్థుల సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నా అధికారులు స్పందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వాలు చేయలేకపోతే గ్రామస్తుల సహాయంతో తామే పాఠశాలలను బాగుచేసుకుంటామని స్పష్టం చేశారు.
