- తండ్రి హత్యను చూశాడని కొడుకునూ పొట్టనబెట్టుకుంది
- బెంగళూరు సిటీలో మహిళ ఘాతుకం
బెంగళూరు: ప్రియుడితో కలిసి ఓ మహిళ కట్టుకున్న భర్త, కన్న కొడుకును హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కక్షతో భర్తను చంపడం, తండ్రి హత్యను చూశాడన్న కారణంతో ఐదేండ్ల కన్న కొడుకును కూడా భార్య తన ప్రియుడితో కలిసి పొట్టనబెట్టుకుంది. బెంగళూరు సిటీలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అభిషేక్ (38), హరిణిల వివాహం 2021లో జరిగింది.
అయితే, గత కొన్నేండ్లుగా వీరి మధ్య మనస్పర్థలు రావడంతో రెండేండ్ల నుంచి ఇద్దరూ వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. 2024 డిసెంబర్‌లో హరిణికి స్నాప్‌చాట్ ద్వారా వినయ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. వినయ్‌తో కలిసి జీవించడం కోసం హరిణి భర్తను విడాకులు కోరింది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న అభిషేక్ 15 రోజుల క్రితం ఆమె కాల్ డీటెయిల్ రికార్డుల కోసం పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయమై దంపతుల మధ్య గొడవలు జరిగాయి. ఈ నెల 14న కూడా వీరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా.. అభిషేక్ ఆమెపై చేయి చేసుకున్నాడు.
ఆ గొడవ తర్వాత హరిణి తన ప్రియుడు వినయ్‌తో కలిసి అభిషేక్ హత్యకు ప్లాన్ వేసింది. ముందు జాగ్రత్తగా రెండు జతల గ్లౌవ్స్‌ను కొనుగోలు చేసింది. ఘటన జరిగే రోజు ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేశారు. ఆదివారం రాత్రి అభిషేక్, తన కొడుకు కలిసి టీవీ చూస్తున్న సమయంలో హరిణి తన ప్రియుడు వినయ్‌ని రహస్యంగా ఇంటిలోకి రప్పించింది. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో అభిషేక్ వేరే గదికి వెళ్లి నిద్రపోయాడు. భర్త గాఢ నిద్రలోకి వెళ్లాక అర్ధరాత్రి 12:30 గంటలకు హరిణి, వినయ్ ఆ గదిలోకి వెళ్లి.. హరిణి భర్త కాళ్లను గట్టిగా పట్టుకోగా.. వినయ్గొంతు నులిమి హత్య చేశాడు. ఈ హడావుడికి కొడుకు నిద్రలేచి.. దారుణాన్ని కళ్లారా చూశాడు.
దీంతో సాక్ష్యం లేకుండా చేయడానికి ఆ చిన్నారిని కూడా వారు హతమార్చారు. సోమవారం ఉదయం తన భర్త, కుమారుడు కదలకుండా పడి ఉన్నారని హరిణి స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి డ్రామా ఆడింది. పోలీసులు స్పాట్‌కు చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అభిషేక్ శరీరంపై ఉన్న గాయాలు చూసి అనుమానం వచ్చి లోతుగా దర్యాప్తు చేశారు. హరిణి, అభిషేక్ మొబైల్ ఫోన్లు, కాల్ డేటా పరిశీలించగా వినయ్ నంబర్ వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో హరిణి నేరాన్ని అంగీకరించింది. దీంతో వారిద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
