ఒకే ఒక్క రాత్రి వర్షానికి కుంగిపోయిన 12 వేల కోట్ల జాతీయ రహదారి..!

ఒకే ఒక్క రాత్రి వర్షానికి కుంగిపోయిన 12 వేల కోట్ల జాతీయ రహదారి..!

న్యూఢిల్లీ: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 12 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జాతీయ రహదారి అది. ఇన్ని కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఆ రోడ్డు ఎంత పటిష్టంగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కానీ ఒకే ఒక్క రాత్రి కురిసిన భారీ వర్షానికి 12 వేల కోట్ల జాతీయ రహదారి కుంగిపోయింది. ఈ ఘటన సాక్ష్యాత్తూ దేశ రాజధాని ఢిల్లీలో జరగడం గమనార్హం.

 2026, జూలై 1న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌లోని ఒక నిర్దిష్ట ప్రదేశంలో రోడ్డు కుంగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. 12 వేల కోట్ల ప్రజా ధనంతో నిర్మించిన హైవే ఒకే ఒక్క రాత్రి కురిసిన భారీ వర్షానికి కుంగిపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై నాసిరకమైన రోడ్లు వేస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతుండటంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నష్ట నివారణ చర్యలకు దిగింది. ఇందులో భాగంగా ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో బాధ్యులైన అథారిటీ ఇంజనీర్ టీమ్ లీడర్‌ను, EPC కాంట్రాక్టర్ ప్రాజెక్ట్ మేనేజర్‌ను ఎన్‎హెచ్‎ఏఐ సస్పెండ్ చేసింది.

 ప్రాజెక్ట్ డైరెక్టర్, అథారిటీ ఇంజనీర్, ఈపీసీ కాంట్రాక్టర్‌కు షో-కాజ్ నోటీసు జారీ చేసింది. రోడ్డు కుంగిన ప్రదేశంలో శాశ్వత క్రాస్-డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా ప్రారంభం కాకపోవడం వల్లే రోడ్డు కుంగిపోయిందని అధికారులు తెలిపారు. స్థానిక నివాసితుల ఆందోళనల కారణంగా డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేయలేకపోయామని ఎన్‎హెచ్‎ఏఐ పేర్కొంది. రోడ్డు కుంగిన చోట వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు తెలిపింది.

ALSO READ : E20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గుతుందా ? ఇంజిన్ పాడవుతుందా ?....

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే

 213 కిలోమీటర్ల పొడవు.. ఆరు లేన్లు గల ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను రూ. 12 వేల కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారు. 2026, ఏప్రిల్ 14న ప్రధాని మోడీ ఈ హైవేను ప్రారంభించారు. ఈ కారిడార్ ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ గుండా వెళుతుంది. దీనివల్ల ఢిల్లీ, డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయం ఆరు గంటల నుంచి సుమారు రెండున్నర గంటలకు తగ్గుతుంది.