E20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గుతుందా ? ఇంజిన్ పాడవుతుందా ?....

E20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గుతుందా ? ఇంజిన్ పాడవుతుందా ?....

భారతదేశంలో E20 ఇథనాల్  బ్లెండింగ్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల అపోహలపై ప్రభుత్వం శుక్రవారం  తీవ్రంగా ఖండించింది. దీనివల్ల బైకులు, కార్ల ఇంజిన్లు పాడైపోతాయని,  కంపెనీ వారెంటీ ఉండదని, మైలేజ్ తగ్గిపోతుందని, పర్యావరణానికి కీడు జరుగుతుందని జరుగుతున్న ప్రచారాలపై క్లారిటీ ఇస్తూ.. ప్రభుత్వం 10 ముఖ్యమైన పాయింట్లతో ఒక ప్రకటన విడుదల చేసింది.

పెట్రోల్‌లో 20% వరకు ఇథనాల్ కలిపే ఈ E20 ప్లాన్‌ను ఎంతో రీసెర్చ్ చేసి, అన్ని రూల్స్ పాటిస్తూ, వేరే దేశాల అనుభవాలను చూశాకే అమలు చేస్తున్నామని పెట్రోలియం&సహజ వాయువుల మంత్రిత్వ శాఖ చెప్పింది.

ఇథనాల్ కలపడంపై ప్రభుత్వం ఇచ్చిన   10 ముఖ్యమైన వివరణలు ఇవే:
 

1. ఇంజిన్లకు  నష్టం  
E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఇంజిన్లు పాడవుతాయని, పార్ట్స్ తుప్పు పడతాయని వస్తున్న వార్తలు అబద్ధం. ఆటోమొబైల్ సంస్థలు, ల్యాబ్‌లలో జరిపిన ఎన్నో పరిశోధనల తర్వాతే దీనిని అనుమతించారు. ప్లాస్టిక్, లోహ భాగాలకు దీనివల్ల ఎలాంటి నష్టం జరగదు. అయితే, చాలా పాత వాహనాల్లోని కొన్ని రబ్బరు పైపులను మాత్రం మార్చుకోవాల్సి రావచ్చు.

2. మైలేజీలో పెద్ద తేడా  
కార్లను 40 వేల కిలోమీటర్లు, బైక్‌లను 20 వేల కిలోమీటర్ల దూరం నడిపి టెస్ట్ చేశారు. మైలేజీలో కేవలం కాస్త మార్పు తప్ప, పెద్దగా బండి పర్ఫార్మెన్స్ లో ఎలాంటి తేడా రాలేదు. పైగా E20 ఇంధనం వల్ల కొత్త వాహనాల్లో పికప్ ఇంకా బాగుంటుంది.

3. వారంటీ, ఇన్సూరెన్స్ క్యాన్సల్  
E20 పెట్రోల్ వాడితే కంపెనీలు ఇచ్చే వెహికల్ వారంటీ లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు రద్దవుతాయని కొందరు భయపడుతున్నారు. కానీ, E20 ఇంధనానికి సపోర్ట్ చేసే వాహనాలకు వారంటీ, బీమాలు ఎప్పటిలాగే వర్తిస్తాయని కంపెనీలు స్పష్టం చేశాయి.

4. ఒక లీటరు ఇథనాల్‌కు 10 వేల లీటర్ల నీరు 
ఇథనాల్ తయారీ కోసం విపరీతంగా నీటిని వాడుతున్నారనేది తప్పు. ప్రస్తుతం ఒక లీటరు ఇథనాల్‌ను తయారు చేయడానికి కేవలం 3 నుండి 5 లీటర్ల నీటిని మాత్రమే వాడుతున్నారు. ఆ నీటిని కూడా రీసైకిల్  చేస్తున్నారు. పైగా ఇథనాల్ తయారీకి తక్కువ నీరు అవసరమయ్యే మొక్కజొన్నలను ఎక్కువగా వాడుతున్నారు.

5. పెట్రోల్‌లో 'చెరకు రసం'  
సోషల్ మీడియాలో పెట్రోల్‌లో డైరెక్ట్  చెరకు రసం కలుపుతున్నట్లు చూపిస్తున్న వీడియోలు నకిలీవి. చెరకు రసం లేదా ధాన్యాల నుండి పరిశ్రమలలో శాస్త్రీయ పద్ధతిలో 'ఇంధన-శ్రేణి ఇథనాల్'ను తయారు చేసి, ఆ తర్వాతే పెట్రోల్‌లో కలుపుతారు.

6. చీమలు, ఈగలు..
E20 పెట్రోల్‌లో చక్కెర అంశాలు ఉంటాయని, అందువల్ల చీమలు, ఈగలు, కీటకాలు చేరుతాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ ఇథనాల్‌ను పూర్తిగా వడబోసి తయారు చేస్తారు కాబట్టి అందులో అస్సలు చక్కెర ఉండదు. పైగా దీనికి ఘాటైన పెట్రోల్ వాసనే ఉంటుంది.

7. ట్యాంకుల్లోకి నీరు..
E20 పెట్రోల్ గాల్లోని తేమను లాగేసుకుని ట్యాంకుల్లో నీరు చేరుతుందనే ఆందోళన అవసరం లేదు. ఆధునిక వాహనాల ట్యాంకులు, బంకుల్లోని స్టోరేజ్ వ్యవస్థలను నీరు చేరకుండా ఉండేలాగే అత్యాధునికంగా డిజైన్ చేశారు.

ALSO READ : ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఎత్తేసిన ఢిల్లీ సర్కార్..

8. ఇది ప్రయోగం కాదు.. ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నదే 
భారతదేశం ఏదో కొత్తగా ప్రయోగం చేయట్లేదు. అమెరికా, బ్రెజిల్, కెనడా, థాయ్‌లాండ్, జపాన్, ఐరోపా దేశాలలో దశాబ్దాలుగా ఈ ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను విజయవంతంగా వాడుతున్నారు.

9. కోర్టులో కేసు..
సుప్రీంకోర్టు E20ని ఒక ప్రయోగం అన్నదంటూ జరిగిన ప్రచారంలో నిజం లేదు. కోర్టులో నడిచిన కేసు ఇథనాల్ కొనుగోలు ఒప్పందాల  గురించింది మాత్రమే, ఇంధనం నాణ్యత గురించి కాదు.

10. దేశానికి, పర్యావరణానికి ఎంతో మేలు 
ఈ ఇథనాల్ బ్లెండింగ్ వల్ల దేశానికి ఎన్నో లాభాలు చేకూరాయి:
*విదేశాల నుండి ముడి చమురు దిగుమతులు తగ్గి, రూ. 1.9 లక్షల కోట్ల దేశీయ డబ్బు ఆదా అయింది.
*ఇథనాల్ కోసం ముడిసరుకు అందించిన రైతులకు రూ. 1.6 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి.
*కాలుష్యం (కార్బన్ ఉద్గారాలు) దాదాపు 930 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గింది.

భారతదేశం అనుకున్న సమయం కంటే ముందే (2025 డిసెంబర్‌కల్లా) పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే లక్ష్యాన్ని సాధించింది. రాబోయే రోజుల్లో ఇథనాల్ ఉత్పత్తిని మరింత పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాబట్టి వాహనదారులు ఎలాంటి అపోహలు, పుకార్లు  నమ్మాల్సిన  అవసరం లేదు.