Morocco vs Canada: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) టోర్నీలో భాగంగా శనివారం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో మొరాకో జట్టు అదరగొట్టింది. కెనడాతో జరిగిన ఈ మ్యాచ్‌లో 3–0 తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేసి దర్జాగా క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. మ్యాచ్ మొదటి అర్ధభాగంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. కానీ, బ్రేక్ తర్వాత రెండవ అర్ధభాగంలో మొరాకో ప్లేయర్స్ వ్యూహం మార్చి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించారు.
చెలరేగిన అజ్జెదిన్ ఔనాహి:
సెకండ్ హాఫ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మొరాకో మిడ్‌ఫీల్డర్ అజ్జెదిన్ ఔనాహి జట్టు ఖాతాను తెరిచాడు. 50వ నిమిషంలో అతను చేసిన అద్భుతమైన గోల్‌తో మొరాకో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా పట్టు వదలకుండా ఆడిన అట్లాస్ లయన్స్ (మొరాకో జట్టు) పదే పదే కెనడా గోల్ పోస్ట్‌పై దాడులు చేసింది. ఈ క్రమంలో 82వ నిమిషంలో ఔనాహి మరోసారి బంతిని నెట్‌లోకి పంపి ఆధిక్యాన్ని 2–0కి పెంచాడు. ఇక మ్యాచ్ ముగుస్తుందనగా, ఇంజురీ టైమ్ (90+8వ నిమిషం)లో సౌఫియన్ రహీమి మూడో గోల్ సాధించి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఆఫ్రికన్ టీమ్:
గణాంకాలను పరిశీలిస్తే, ఈ మ్యాచ్‌లో మొరాకో కంటే కెనడాకే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. కెనడా ఆటగాళ్లు 10 షాట్లు ఆడగా, మొరాకో కేవలం 5 షాట్లు మాత్రమే ఆడింది. కానీ, ఆఫ్రికన్ జట్టు తమకు వచ్చిన అవకాశాలను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుంది. తాము ఆన్-టార్గెట్ చేసిన నాలుగు షాట్లలో ఏకంగా మూడింటిని గోల్స్‌గా మలచడం వారి నైపుణ్యానికి అద్దం పడుతోంది. బాల్ పొజిషన్‌లో కూడా మొరాకో 56 శాతం ఆధిపత్యం ప్రదర్శించగా, 85 శాతం కచ్చితత్వంతో 399 పాస్‌లు చేసింది. మరోవైపు కెనడా 78 శాతం కచ్చితత్వంతో 348 పాస్‌లకే పరిమితమైంది.
డిఫెన్స్‌తో కెనడాకు మొరాకో చెక్:
మ్యాచ్ ఆసాంతం కెనడా జట్టు కూడా గోల్ కోసం తీవ్రంగా శ్రమించింది. వారికి ఏకంగా 11 కార్నర్‌లు లభించినప్పటికీ, మొరాకో పటిష్టమైన డిఫెన్స్‌ను ఛేదించి ఒక్కసారి కూడా బంతిని నెట్‌లోకి పంపలేకపోయారు. ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఈ మ్యాచ్ ఫిజికల్‌గా సాగింది. ఆటగాళ్ల దూకుడును నియంత్రించేందుకు రిఫరీ రెండు జట్లకు చెరో నాలుగు ఎల్లో కార్డులు జారీ చేశారు. కానీ, ఏ ఆటగాడికీ రెడ్ కార్డ్ రాకపోవడం గమనార్హం.
క్వార్టర్స్‌లో తదుపరి పోరు ఫ్యాన్స్ తోనే:
ఈ అద్భుత విజయంతో ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్‌కు సగర్వంగా చేరిన మొరాకో, ఇప్పుడు సెమీ-ఫైనల్స్ బెర్త్ కోసం ఆరాటపడుతోంది. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా ఫ్రాన్స్, పరాగ్వే జట్ల మధ్య జరిగిన మరో నాకౌట్ మ్యాచ్ విజేతగా నిలిచిన ఫ్రాన్స్ తో మొరాకో తమ తదుపరి పోరులో తలపడనుంది.
Azzedine Ounahi goal in Canada vs Morocco FIFA World Cup Round of 16 game pic.twitter.com/DX1dUedLB2
— Daily Foot Vibes (@dailyfootvibes) July 4, 2026
Azzedine Ounahi 2nd goal in Canada vs Morocco FIFA World Cup Round of 16 game pic.twitter.com/koqPC5Y9hU
— Daily Foot Vibes (@dailyfootvibes) July 4, 2026
