ఏం కుటుంబంరా మీది.. ఫ్యామిలీ మొత్తం దొంగలే.. బస్సు ఎక్కేటప్పుడు చైన్ స్నాచింగ్

ఏం కుటుంబంరా మీది.. ఫ్యామిలీ మొత్తం దొంగలే..    బస్సు ఎక్కేటప్పుడు చైన్ స్నాచింగ్

నిజామాబాద్, వెలుగు: బస్సు ఎక్కే వృద్ధుల బంగారు గొలుసులు చోరీ చేస్తున్న తల్లి, కొడుకు, కూతురు, కోడలితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన 6.3 తులాల బంగారం, కారును స్వాధీనం చేసుకున్నారు. 

నిజామాబాద్​ ఏసీపీ ప్రకాశ్​యాదవ్​ శనివారం తన ఛాంబర్​లో మీడియాకు వివరాలు వెల్లడించారు. నిర్మల్​ జిల్లా భైంసా పట్టణం నయాబాదికి చెందిన ఖుతీజాబేగం(67) గతంలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చింది. కొడుకు షేక్​ అంజద్, కోడలు తాహెరా, కూతురు నజ్మాబేగం, నయాబాదికి చెందిన కారు​డ్రైవర్​ అబ్దుల్​ జుబేర్, షేక్​ వసీం అహ్మద్​తో కలిసి ముఠా ఏర్పాటు చేసింది. వీరంతా కలిసి ఆర్టీసీ బస్సుల్లో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను టార్గెట్​ చేస్తారు. ఖుతీజాబేగం వారితో మాటలు కలిపి ఎక్కడికి వెళ్తున్నారో? తెలుసుకొని తానూ అటే వెళ్తున్నట్లు నమ్మిస్తుంది. 

బస్సు ఎక్కే టైంలో మెడలో నుంచి చైన్​ లాగేసుకుంటుంది. అలాగే బస్​లో కొడుకు, కోడలు, కూతురుతో ప్రయాణం చేస్తూ అదను చూసి గోల్డ్​ చైన్లు మాయం చేసి తరువాతి స్టాప్​లో అందరూ దిగి అబ్దుల్​ జుబేర్​ కారులో వెళ్లిపోతారు. బంగారాన్ని నగదుగా మార్చుకునేందుకు షేక్​ వసీం అహ్మద్​ సహకరిస్తాడు. ఇలా నిర్మల్​ జిల్లా కుబీర్, భైంసా, ముథోల్, నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో దొంగతనాలు చేశారు. నార్త్​ రూరల్​ సీఐ బి.శ్రీనివాస్, ఎస్సై శ్రీకాంత్, ఏఎస్సై గఫార్  పాల్గొన్నారు.