అరవింద్.. వేల కోట్లు ఎట్లా వచ్చినయ్.. మేం వ్యక్తిగతంగా మాట్లాడితేBJP నేతలు రోడ్ల మీద తిరగలేరు

అరవింద్.. వేల కోట్లు ఎట్లా వచ్చినయ్.. మేం వ్యక్తిగతంగా మాట్లాడితేBJP నేతలు రోడ్ల మీద తిరగలేరు

జనగామ, వెలుగు : బీడీలు చుట్టిన ఇంటి నుంచి వచ్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రశ్నించారు. శనివారం జనగామ డీసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​గౌడ్​పై సభ్యత, సంస్కారం లేకుండా వ్యక్తిగతంగా చేసిన కామెంట్లను ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాంగ్రెస్​పైనే విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. తాము కూడా వ్యక్తిగతంగా మాట్లాడితే మీ పార్టీ నాయకులు రోడ్ల మీద తిరగలేరన్నారు. బీసీలకు ద్రోహం చేసిన మల్లన్నకు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కాంగ్రెస్​కారణంగా ఎమ్మెల్సీగా గెలిచిన మల్లన్న.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 

'నీ పార్టీ బీ ఫాంపై పోటీ చేసి డిపాజిట్​ తెచ్చుకుంటే.. నేను ఆలేరులో పోటీ చేయను' అని సవాల్ చేశారు. అంతకుముందు జనగామ కలెక్టరేట్‌‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్​ బీర్ల అయిలయ్య పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు. 

‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యంతో జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులు లబ్ధిదారుల గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని అయిలయ్య అన్నారు. జిల్లాకు 1,87,214 కార్డులు వచ్చాయని, 15 రోజుల్లో పంపిణీ చేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌‌లో మీ-సేవా కేంద్రాన్ని ప్రారంభించి, ‘ఇండిపెండెన్స్ గార్డెన్’కు శ్రీకారం చుట్టారు.