Mohanlal Ivory Case: ఏనుగు దంతాల వివాదంలో కొత్త ట్విస్ట్.. క్షమాభిక్ష కోరిన నటుడు మోహన్‌లాల్!

Mohanlal Ivory Case: ఏనుగు దంతాల వివాదంలో కొత్త ట్విస్ట్.. క్షమాభిక్ష కోరిన నటుడు మోహన్‌లాల్!

మలయాళ స్టార్ నటుడు మోహన్‌లాల్‌కు సంబంధించిన ఏనుగు దంతాల కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. 2011లో ఆయన నివాసంలో  ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఏనుగు దంతాల వ్యవహారంలో 2012లో కేసు నమోదు కాగా, ఇప్పటికీ తుది తీర్పు వెలువడలేదు. ఈ నేపథ్యంలో మోహన్‌లాల్ మరోసారి కోర్టును ఆశ్రయించినట్లు మలయాళ సినీ వర్గాలు వెల్లడించాయి.

తాజాగా ఈ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. మోహన్ లాల్ తన వద్ద ఉన్న ఏనుగు దంతపు వస్తువులను అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక అమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. ఈ ప్రక్రియ ద్వారా ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండే అవకాశం ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. 

క్షమాభిక్ష దరఖాస్తు నేపథ్యంలో, అటవీ శాఖ అధికారులు కొచ్చిలోని మోహన్‌లాల్ నివాసానికి వెళ్లి ఆయన వద్ద ఉన్న దంతపు వస్తువుల మూలం, వాటి వయస్సు, వాటిని ఎప్పుడు మరియు ఎలా సొంతం చేసుకున్నారనే అంశాలపై వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అలాగే గతంలో అవి ఎందుకు ప్రకటించలేదనే విషయంపైనా అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ క్షమాభిక్ష పథకం చట్టబద్ధతపై కూడా న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది. మరి కేరళ ప్రభుత్వ క్షమాభిక్ష పథకం.. మోహన్‌లాల్‌కు కోర్టు రక్షణ కల్పిస్తుందా? లేదా అనేది ఉత్కంఠగా మారింది.

వివాదం ఎలా మొదలైందంటే:

ఈ కేసు మొదటగా 2011 డిసెంబర్ 21న వెలుగులోకి వచ్చింది. ఐటీ అధికారులు కొచ్చిలోని తేవరలో ఉన్న మోహన్ లాల్ ఇంట్లో రైడ్స్ చేశారు. ఈ క్రమంలో మోహన్ లాల్ ఇంట్లో  రెండు జతల ఏనుగు దంతాలును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏనుగు దంతాలు అక్రమంగా సేకరించినట్లు తేలడంతో..  వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉల్లంఘన కింద ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ 2012లో కేసు నమోదు చేసింది. 

ఓ వైపు కేసు విచారణ నడుస్తోన్న సమయంలోనే 2016లో ఏనుగు దంతాలు చట్టబద్ధంగా కొనుగోలు చేశానని.. తనపై నమోదైన కేసును ఉపసంహరించుకోవాలని మోహన్ లాల్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. మోహన్ లాల్ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన కేరళ ప్రభుత్వం ఈ మేరకు మోహన్ లాల్‎కు యాజమాన్య ధృవీకరణ పత్రాలను జారీ చేసింది.

ఈ ఉత్తర్వులు ఆధారంగా మోహన్ లాల్‎ పై అటవీ శాఖ పెట్టిన కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చూసింది. కానీ పెరుంబవూర్ మేజిస్ట్రేట్ కోర్టు దాన్ని తిరస్కరించింది. దీంతో పెరుంబవూర్ మేజిస్ట్రేట్ కోర్టు నిర్ణయాన్ని మోహల్ లాల్ కేరళ హైకోర్టులో సవాల్ చేశారు. ఇదే సమయంలో మోహన్ లాల్‎ అక్రమంగా ఏనుగు దంతాలు సేకరించాడని.. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జేమ్స్ మాథ్యూ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎకె జయశంకరన్ నంబియార్, జస్టిస్ జోబిన్ సెబాస్టియన్‌లతో కూడిన డివిజన్ 2025, అక్టోబర్ 24న కీలక తీర్పు వెలువరించింది. మోహన్ లాల్ ‎కు ప్రభుత్వం జారీ చేసిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్‌ను చట్టవిరుద్ధమని ప్రకటించి దానిని రద్దు చేసింది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ప్రక్రియలో లోపాలున్నాయని, కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. 

అయితే, వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ జారీ చేసి, అవసరమైతే మళ్లీ యాజమాన్య ధ్రువపత్రాలు ఇవ్వవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం అమ్నెస్టీ పథకాన్ని తీసుకురాగా, మోహన్‌లాల్ కూడా దాని కింద తన వద్ద ఉన్న దంతపు వస్తువులను ప్రకటించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ అమ్నెస్టీ పథకం చట్టబద్ధతపై కూడా న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది. దీనిపై తుది నిర్ణయం వచ్చే వరకు మోహన్‌లాల్ చేసిన ప్రకటనలు, తదుపరి చర్యలు కోర్టు తీర్పుకు లోబడి ఉంటాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.