తక్కువ ఖర్చుతో ప్రకృతి అందాల విందు.. టాప్ 5 వందేభారత్ రూట్లు ఇవే..

తక్కువ ఖర్చుతో ప్రకృతి అందాల విందు.. టాప్ 5 వందేభారత్ రూట్లు ఇవే..

ప్రయాణం అంటే గమ్యస్థానానికి చేరుకోవడమే కాదు.. కిటికీలోంచి కనిపించే అద్భుతమైన ప్రకృతి అందాలను ఆస్వాదించడం కూడా. అలాంటి అనుభూతిని తక్కువ ఖర్చులోనే అందిస్తున్నాయి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు. ఒకప్పుడు ప్రీమియం ప్రయాణంగా భావించిన వందేభారత్‌లో ఇప్పుడు రూ.15వందల లోపే దేశంలోని అత్యంత అందమైన రూట్లలో ప్రయాణించే అవకాశం ఉండటంతో ప్రయాణికుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు మరిచిపోలేని ప్రకృతి దృశ్యాలు ఈ రైళ్ల ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

బెంగళూరు–ధారవాడ... కర్ణాటక అందాల మధ్య ప్రయాణం

సుమారు రూ.1,195 ఏసీ చెయిర్ కార్ చార్జీతో నడిచే ఈ రూట్ ఐటీ నగరం బెంగళూరును ధారవాడతో కలుపుతుంది. మార్గమంతా పచ్చని పొలాలు, గ్రామీణ కర్ణాటక అందాలు ప్రయాణికులను కట్టిపడేస్తాయి. విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకులు ఎక్కువగా ఎంచుకునే వందేభారత్ రూట్లలో ఇది ఒకటి.

చెన్నై–కోయంబత్తూరు... ప్రకృతి ఒడిలో స్పీడ్ జర్నీ

సుమారు రూ.925 టికెట్‌తో ఈ ప్రయాణం తమిళనాడులోని పచ్చని వ్యవసాయ భూములు, అడవుల అంచులను చూపిస్తుంది. రోడ్డు ప్రయాణంతో పోలిస్తే చాలా వేగంగా, సౌకర్యంగా ఉండే ఈ రైలు ఊటీ, నీలగిరి పర్వతాలకు వెళ్లే పర్యాటకులకు బెస్ట్ ఛాయిస్‌గా మారింది.

కాసరగోడ్–తిరువనంతపురం... కేరళ అందాల విందు

సుమారు రూ.1,250తో కేరళను దాదాపు మొత్తం దాటే ఈ ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు పండుగలా ఉంటుంది.  త్రిస్సూర్, ఎర్నాకుళం, కొట్టాయం, కొల్లం వంటి ప్రముఖ ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ పచ్చని కొబ్బరి తోటలు, నదులు, చారిత్రక పట్టణాల అందాలను దగ్గరగా చూసే అవకాశం లభిస్తుంది.

సబర్మతి–వేరావల్... సోమనాథ్ యాత్రకు సూపర్ ఆప్షన్

రూ.980 నుంచి రూ.1,125 మధ్య టికెట్ ధరతో నడిచే ఈ వందేభారత్ రైలు సోమనాథ్ ఆలయానికి వెళ్లే భక్తులకు అత్యంత సౌకర్యవంతమైన మార్గంగా నిలిచింది. వేరావల్ స్టేషన్ నుంచి సోమనాథ్ ఆలయం కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఈ రూట్‌కు మంచి ఆదరణ ఉంది.

జమ్మూ–శ్రీనగర్... మంచు పర్వతాల మధ్య అద్భుత ప్రయాణం

రూ.855 నుంచి రూ.1,020 మధ్య టికెట్‌తో అందుబాటులో ఉన్న ఈ రూట్ వందేభారత్‌లో అత్యంత అందమైన ప్రయాణాల్లో ఒకటిగా నిలిచింది. పీర్ పంజాల్ పర్వత శ్రేణులు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెనాబ్ రైల్వే వంతెన మీదుగా ప్రయాణించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది. చివరగా కాశ్మీర్ లోయలోకి ప్రవేశించే ఈ ప్రయాణం డాల్ సరస్సు, నిషాత్ గార్డెన్స్, మంచుతో కప్పుకున్న కొండల అందాలను ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తుంది.

తక్కువ ఖర్చు, అత్యాధునిక సౌకర్యాలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు... ఈ మూడు కలిపి వందేభారత్ రైళ్లను దేశీయ పర్యాటకులకు అత్యంత ఆకర్షణీయమైన ట్రావెల్ చాయిస్ గా మార్చేశాయి.