Sunday Special: ఎనర్జీ ఎగ్... కమ్మని రుచి..సూపర్ వెరైటీస్..ఫుల్ ఇమ్యూనిటి పవర్

Sunday Special: ఎనర్జీ ఎగ్... కమ్మని రుచి..సూపర్ వెరైటీస్..ఫుల్ ఇమ్యూనిటి పవర్

వర్షాకాలం మొదలైంది.. అడపా దడపా వర్షాలు కూడా పడుతున్నాయి.  చాలామంది జలుబు.. దగ్గుతో బాధపడుతున్నారు. అందుకే కచ్చితంగా  రోగనిరోధకశక్తిని పెంచుకోవాలి.  దానికోసం పోషకాహారం తీసుకోవడమే సరైన మార్గం. అందుకని రోజూ తినేవాటిలో పండ్లు, తాజా కూరగాయలతో పాటు రోజుకు రెండు గుడ్లు తినాలి. అయితే రోజు ఉడకబెట్టిన గుడ్లు తినాలంటే బోర్ కడుతుంది. అలాకాకుండా ఉండాలంటే ఎగ్ బజ్జీ, ఎగ్​ రోల్, పచ్చడి చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . !

ఎగ్ రోల్ తయారీకి కావలసినవి

 

  •  కోడిగుడ్లు- నాలుగు
  • కారం-ఒక టీ స్పూన్
  • క్యారెట్ తురుము- ఒక టేబుల్ స్పూన్ (కావాలనుకుంటేనే)
  • ఉప్పు- తగినంత
  •  నూనె - సరిపడా 
  • కొత్తిమీర తరుగు - పావు కప్పు
  • ఉల్లిగడ్డ తరుగు - ఒక టేబుల్ స్పూన్

ఎగ్​ రోల్​ తయారీ విధానం

 ఒక గిన్నెలో కోడిగుడ్ల సొన కొట్టాలి. అందులో ఉప్పు, కారం, ఉల్లిగడ్డ తరుగు, క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. స్టవ్​పై వెడల్పాటి పాన్ పెట్టి, కోడిగుడ్డు మిశ్రమంతో కాస్త పలుచగా ఆమ్లెట్ వేయాలి. రెండువైపులా బాగా కాలాక, ఒకవైపు నుంచి నెమ్మదిగా కోల్ చేయాలి ఇలా నాలుగైదు ఆమ్లెట్ రోల్స్ చేసి, వాటిని చపాతీ లేదా దోశెల్లో పెట్టుకొని తినొచ్చు. లేదంటే టొమాటో సాస్​ లో నంజుకున్నా టేస్టీగా ఉంటాయి.

ఎగ్​పచ్చడి తయారీకి కావాల్సినవి

 

  •  కోడిగుడ్లు - మూడు (ఉడికించినవి)
  •  గరం మసాలా- రెండు టేబుల్ స్పూన్లు
  • మెంతి పొడి-ఒకటి స్పూన్
  • ఆవాల పొడి - ఒక టేబుల్ స్పూన్
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
  • ఉప్పు తగినంత
  • నూనె - మూడు టేబుల్ స్పూన్లు
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  •  కారం- ఒక టేబుల్ స్పూన్
  •  ఆవాలు- ఒక టీస్పూన్
  • జీలకర్ర - ఒక టీ స్పూన్
  • నిమ్మకాయ ఒకటి
  • కొత్తిమీర - పావు కప్పు

ఎగ్​ పచ్చడి తయారీ విధానం 

 ఉడికించిన గుడ్ల పొట్టు తీసి పక్కనబెట్టుకోవాలి. స్టవ్​ పై  వెడల్పాటి గిన్నెపెట్టి నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. తర్వాత ఉడికించిన గుడ్ల మీద కత్తితో గాట్లు పెట్టి అందులో వేయాలి. సన్నని మంటపై వేగించాలి. కోడిగుడ్లు ఎరుపు రంగులోకి మారాక అల్లం-వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం వేసి కాసేపు వేగించాలి. చివరగా కరివేపాకు,కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆపేయాలి. మిశ్రమం చల్లారాక ఆవాల పొడి, మెంతి పొడి వేయాలి. ఆ పైన నిమ్మరసం వేసి కలిపితే రుచికరమైన కోడిగుడ్డు పచ్చడి రెడీ.

ఎగ్​ బజ్జీ తయారీకి కావాల్సినవి

  •  కోడిగుడ్లు –నాలుగు(ఉడికించినవి) 
  • కార్న్ ఫ్లోర్-పావు కప్పు
  • శెనగపిండి- రెండు కప్పులు
  •  బియ్యప్పిండి- ఒకటిన్నర కప్పు
  • ఉప్పు- తగినంత
  • నూనె-సరిపడా
  • వెల్లుల్లి తరుగు - అర టీస్పూన్
  •  పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్
  •  ఉల్లిగడ్డ తరుగు- పావు కప్పు
  • అల్లం తరుగు - పావు టీస్పూన్

ఎగ్​ బజ్జీ తయారీ విధానం

 ఉడికించిన గుడ్లను ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేయాలి. తర్వాత అందులో శెనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, కార్న్ ఫ్లోర్, పచ్చిమిర్చి, నెల్లుల్లి, ఉల్లిగడ్డ, అల్లం తరుగు వేయాలి. కొన్నినీళ్లు చల్లి బజ్జీల్లా చేసి, మరుగుతున్న నూనెలో వేసి వేగించాలి. బజ్జీలు గోధుమరంగులోకి మారాక తీయాలి. వాటిపై ధనియాల పొడి, గరం మసాలా చల్లి తింటే బాగుంటాయి.