రోశయ్య అందరికీ రోల్ మోడల్.. మా నాన్నతో ఆయన బంధం చాలా గొప్పది: మంత్రి వివేక్ వెంకటస్వామి

రోశయ్య అందరికీ రోల్ మోడల్.. మా నాన్నతో ఆయన బంధం చాలా గొప్పది: మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య గారితో తనకున్న అనుబంధాన్ని, తన కుటుంబానికి ఉన్న పాత జ్ఞాపకాలను, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య గారు ఎల్లప్పుడూ అందరికీ ఒక రోల్ మోడల్ రాజకీయ నాయకుడిగా నిలిచారని  మంత్రి వివేక్ వెంకటస్వామి కొనియాడారు.  

గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రోశయ్య గారు ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీలో ఎన్నో కీలకమైన విషయాలను  లేవనెత్తేవారని  గుర్తుచేశారు. ఆయన అసెంబ్లీలో బడ్జెట్ పేపర్లను క్షుణ్ణంగా చదివేవారు. ఏ పాయింట్ వద్ద ప్రభుత్వాన్ని నిలదీయాలో, ఎలాంటి సలహాలు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. "రాష్ట్రం ఏ దిశలో వెళ్తోంది, ప్రాధాన్యతలు ఏమిటి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి అనేది అందరికీ అర్థమయ్యేలా వివరించేవారు" అని వివేక్ వెంకటస్వామి అన్నారు.

రోశయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  తెలంగాణ ప్రస్తావన వస్తే ఆయన ఎంతో పరిణతితో వ్యవహరించేవారని మంత్రి తెలిపారు. తెలంగాణ కోసం పోరాడమంటూనే, రెండు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరిగేలా ఆలోచించాలని రోశయ్య గారు చెప్పేవారన్నారు.

రోశయ్య గారి పనితీరు గురించి మాట్లాడుతూ.. ఆయన  రాత్రి వేళల్లో కూడా సెక్రటేరియట్‌లోనే ఉంటూ ఫైళ్లను క్లియర్ చేసేవారని వివేక్ వెంకటస్వామి చెప్పుకొచ్చారు. ఏ నిర్ణయం తీసుకున్నా అందులో తప్పు ఒప్పులు ఏంటి, అది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే ఆయన ముందడుగు వేసేవారని చెప్పారు.

మా నాన్న గారితో గొప్ప స్నేహం
తన తండ్రి, దివంగత వెంకటస్వామి (కాకా) గారితో రోశయ్య గారికి ఉన్న స్నేహం చాలా గొప్పదని మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ఎప్పుడూ ఒక మంత్రిలానో, ముఖ్యమంత్రిలానో కాకుండా ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా పలకరిస్తూ వ్యక్తిగత అనుబంధాన్ని కొనసాగించేవారని వివేక్ వెంకటస్వామి అన్నారు.