ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడుకున్నోళ్లకు వాడుకున్నంత. ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా.. మాయ చేయొచ్చు. ఏఐ వచ్చాక చాలా వరకు పనులు సులభం అయ్యాయి. గంటల తరబడి చేయాల్సిన పని నిమిషాల్లో అయిపోతుంది. ఈ కాంట్రాక్టర్లు కూడా అలాగే ఉపయోగించారు. గంటల్లో క్లీన్ చేయాల్సిన చెత్తను నిమిషాల్లో ఎత్తేసి కాలనీలు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచారు. వీళ్ల ట్యాలెంట్ కు పై అధికారులు వాహ్వ వాహ్వ అంటూ సెల్యూట్ చేసి ఉద్యోగాల్లో నుంచి తీసేశారు. వివరాలేంటో చూద్దాం.
గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ (MCG)లో కాంట్రాక్టర్లు చేసిన ఏఐ మాయాజాలం చర్చనీయంగా మారింది. చెత్త ఎత్తకుండానే, పనులు చేయకుండానే AI ఉపయోగించి ఫేక్ ఫోటోలు అప్‌లోడ్ చేసి పనిపూర్తయినట్లు రిపోర్టు ఇచ్చారు ఉద్యోగులు. GPS స్పూఫింగ్ ద్వారా హాజరు చూపించిన నలుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులను అధికారులు తొలగించారు.
ప్రజా సేవల్లో టెక్నాలజీ దుర్వినియోగం ఎలా ఈ ఘటన ఉదాహరణ. MCG కమిషనర్ ప్రదీప్ దహియా తెలిపిన వివరాల ప్రకారం, సానిటేషన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న వసీం అనే ఉద్యోగి చెత్త సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించినట్లు చూపించడానికి AI టూల్స్ ఉపయోగించాడు. నకిలీ ఫోటోలు సృష్టించి అధికారిక పోర్టల్ లో అప్‌లోడ్ చేశాడు. ఎప్పుడూ సైట్‌లకు వెళ్లకుండానే.. పని పూర్తయినట్లు ఫోటోలు అప్ లోడ్ చేసి చేతులు దులుపుకున్నాడు.
►ALSO READ | ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలపై లైంగిక కంటెంట్ యాడ్స్.. మెటాకు కేంద్రం నోటీసులు!
మరో ఉద్యోగి సోను GPS స్పూఫింగ్ టెక్నాలజీ ఉపయోగించి వేరే చోట ఉండి.. వర్క్ లొకేషన్ లోనే ఉన్నట్లు అటెండెన్స్ చూపించాడు. జజ్జర్‌లో దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోను.. గురుగ్రామ్‌లో ఉన్నట్లు చూపించాడు. ప్రాపర్టీ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లోని నీరజ్ వశిష్ట్, అంకుర్ అరోరా అనే ఇద్దరు ఉద్యోగులు కూడా అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించారు. ప్రాపర్టీ ID సంబంధిత కేసుల్లో అనవసరమైన అభ్యంతరాలు ఎత్తి చూపడం, నిబంధనలు (SOPs) పాటించకపోవడం వంటి ఆరోపణలు వచ్చాయి.
అధికారులు డిజిటల్ మానిటరింగ్ సిస్టమ్‌ల ద్వారా ఈ అక్రమాలను గుర్తించారు. డిజిటల్ సబ్మిషన్లతో పాటు ఫీల్డ్‌లో ఎంక్వైరీ చేపట్టి అక్రమాలను నిగ్గు తేల్చినట్లు కమిషనర్ ప్రదీప్ దహియా చెప్పారు.
