రైతు భరోసా కింద మూడో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. గురువారం 3 నుంచి 4 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.1,330.32 కోట్లను నేరుగా జమ చేసింది. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద మూడో విడత నిధులను బుధవారం విడుదల చేసింది. గురువారం 3 నుంచి 4 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.1,330.32 కోట్లను నేరుగా జమ చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 6.39 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా, 22.17 లక్షల ఎకరాల సాగుభూమికి రైతుభరోసా సాయం అందినట్లు మంత్రి వెల్లడించారు.
రైతుభరోసా పథకం కింద ఇప్పటివరకు మూడు విడతల్లో మొత్తం 61.35 లక్షల మంది రైతులకు, 90.04 లక్షల ఎకరాల సాగుభూమికి సంబంధించి రూ.5,402.37 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసినట్టు మంత్రి వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విడతల వారీగా నిధులను విడుదల చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే తొలి రెండు విడతల్లో 3 ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులను జమ చేసిన ప్రభుత్వం, తాజాగా 3 నుంచి 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ సాయం అందించినట్టు తెలిపారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి రైతుకు రైతుభరోసా సాయం అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
