‘మాకు మీ రక్తం కాదు.. నాణ్యమైన చదువు కావాలి’ : ఆకునూరి మురళి

‘మాకు మీ రక్తం కాదు.. నాణ్యమైన చదువు కావాలి’ : ఆకునూరి మురళి
  • బండి సంజయ్‌‌‌‌కి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కౌంటర్
  • ప్రజలు ప్రశ్నిస్తారనే విద్యకు దూరం చేస్తున్నారని ఫైర్

హైదరాబాద్, వెలుగు: ‘మాకు మీ రక్తం వద్దు.. మీ దేశభక్తి మాటలు వద్దు.. మాకు కావాల్సింది నాణ్యమైన విద్య, వైద్యం, యువతకు గౌరవప్రదమైన ఉద్యోగాలు’ అని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి అన్నారు. పదేండ్లలో నాణ్యమైన విద్య కోసం కేటీఆర్ ఏం చేశారని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారని, మరి కేంద్రంలో అధికారంలో ఉండి మీరేం చేశారో చెప్పాలని నిలదీశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆకునూరి మురళి ‘ఎక్స్’ వేదికగా మంగళవారం స్పందించారు.

‘విద్య విషయంలో బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం విద్యారంగానికి అతితక్కువ నిధులు కేటాయిస్తూ మీ ఇద్దరి పంచన చేరింది. ఈ మూడు పార్టీలూ ఎడ్యుకేషన్ విషయంలో ప్రజల్ని మోసం చేస్తున్నాయి’ అని మండిపడ్డారు. ‘మీ కంటే టన్నుల కొద్దీ ఎక్కువ దేశభక్తి మాకు ఉంది, అది మీకు కనపడదు’ అని విమర్శించారు. రాష్ట్రం నుంచి కేంద్రం 50 శాతం జీఎస్టీ, 100 శాతం ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్‌‌‌‌తోపాటు కార్పొరేట్, ఎక్సైజ్ పన్నులు వసూలు చేస్తోందని, కానీ రాష్ట్రంలో విద్య కోసం కేంద్రం ఏం చేస్తుందని బండి సంజయ్‌‌‌‌ను నిలదీశారు.

ప్రపంచంలోనే విద్యకు అతి తక్కువగా 2.5 శాతం బడ్జెట్ కేటాయిస్తున్న ఏకైక దేశం మనదేనని స్పష్టం చేశారు. అసలు అందరికీ విద్య ఇవ్వాలన్న భావజాలమే మీ దగ్గర లేదని బండి సంజయ్‌‌‌‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, శాస్త్రీయ ఆలోచనలు అందితే మిమ్మల్ని ప్రశ్నిస్తారనే కుట్రతో విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు గ్రహించాలని, పిల్లల భవిష్యత్ కోసం పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.