ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే 123 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు నారాయణ.
గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని.. సుమారు రూ. 2వేల కోట్లు కేటాయించామని.. ఇందులో రాజమండ్రి అభివృద్ధి పనులు రూ. వెయ్యి కోట్లు కేటాయించామని అన్నారు నారాయణ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ పుష్కరాల నిర్వహణకు నిధుల కొరత లేకుండా చూస్తామని అన్నారు.
జల్ జీవన్ మిషన్ కింద మంజూరైన రూ.5 వేల 350 కోట్ల నిధులు వినియోగించకపోవడంతో నిలిచిపోయిన ప్రాజెక్టులను కేంద్ర సహకారంతో పునరుద్ధరిస్తామని అన్నారు నారాయణ.
అమరావతిని ప్రపంచంలోనే ఐదు ఉత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు నారాయణ. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 2028 చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
