KL రాహుల్ క్లాసీ సెంచరీ: రోహిత్ శర్మ రచ్చ, గైక్వాడ్ గర్జన.. విండీస్ ముందు భారత్ భారీ టార్గెట్

KL రాహుల్ క్లాసీ సెంచరీ: రోహిత్ శర్మ రచ్చ, గైక్వాడ్ గర్జన.. విండీస్ ముందు భారత్ భారీ టార్గెట్

IND vs WI: న్యూ చండీగఢ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో టీమిండియా బ్యాటర్లు మరోసారి పరుగుల వరద పారించారు. ఆరంభంలోనే స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును, కేఎల్ రాహుల్ క్లాసీ సెంచరీతో ఆదుకున్నాడు. రోహిత్ శర్మ (92) తృటిలో శతకం కోల్పోయినా, బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు సాధించి, విండీస్ ముందు 352 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఆరంభంలో షాక్‌.. రాహుల్, రోహిత్ అద్భుత పోరాటం: 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఊహించని షాక్‌ తగిలింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (1), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (0)తో పాటు నితీశ్ కుమార్ రెడ్డి (9) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. విండీస్ పేసర్ జేడెన్ సీల్స్ అద్భుతమైన బౌలింగ్‌తో భారత టాప్ ఆర్డర్‌ను వణికించాడు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఓపెనర్ రోహిత్ శర్మ (92 పరుగులు) కిరాక్ ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోర్ బోర్డుని ముందుకు నడిపించాడు. సెంచరీకి చేరువైన తర్వాత క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (129 పరుగులు నాటౌట్) మైదానం నలుమూలల షాట్లు బాదుతూ అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచులోనే కేఎల్ రాహుల్ తన అంతర్జాతీయ వన్డే కెరీర్ లో 10,000 పరుగులని కూడా పూర్తి చేసుకున్నాడు.  

రుతురాజ్, నమన్ ధీర్ మెరుపులు.. విండీస్ బౌలర్ల కట్టడి: 

నాలుగో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (57 పరుగులు) అర్ధశతకంతో రాణించి రోహిత్ కి చక్కటి భాగస్వామ్యాన్ని అందించాడు. ఇక ఇన్నింగ్స్ చివర్లో మిడిలార్డర్ బ్యాటర్ నమన్ ధీర్ (30 పరుగులు) దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 350 పరుగుల మార్క్‌ను సులభంగా దాటగలిగింది. కాగా వెస్టిండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ 3 వికెట్లు పడగొట్టి భారత్‌ను దెబ్బతీశాడు. అలాగే కీమో పాల్ 2 వికెట్లు, గుడకేష్ మోటీ 1 వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం 352 పరుగుల భారీ లక్ష్యంతో వెస్టిండీస్ బ్యాటింగ్‌ చేయనుంది.