- సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా రాష్ట్రవ్యాప్త నిరసనలు
- పీఆర్సీ, పెండింగ్ డీఏలు ఇవ్వాలని, ఓపీఎస్ అమలు చేయాలని ఉద్యోగుల జేఏసీ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 10న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్న డీఏలు విడుదల చేయడంతో పాటు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.
పీఆర్సీ రిపోర్టును కమిషన్ నుంచి తెప్పించుకుని వెంటనే ఫిట్‌మెంట్ ప్రకటించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న అన్ని జిల్లా కేంద్రాల్లో మహాధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. పీఆర్సీ రిపోర్టు విడుదల చేసే వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామన్నారు. వచ్చే నెల 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ప్రకటించారు.
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) అమలుకు సీఎం ఆదేశాలు ఇచ్చినా హెల్త్, ఫైనాన్స్ అధికారుల నిర్లక్ష్యంతో అమలు కావడం లేదని నేతలు ఆరోపించారు. ప్రైవేట్ హాస్పిటళ్లకు పాత బకాయిలు చెల్లించడం లేదన్నారు. సమావేశంలో జేఏసీ నేతలు వంగ రవీందర్‌రెడ్డి, ముజీబ్, శ్యామ్, సదానందం గౌడ్ పాల్గొన్నారు.
