స్కూళ్లకు సమీపంలో.. స్టింగ్ ఎనర్జీ డ్రింక్ అమ్మకాల నిషేధం! 

స్కూళ్లకు సమీపంలో.. స్టింగ్ ఎనర్జీ డ్రింక్ అమ్మకాల నిషేధం! 

ఎనర్జీ డ్రింక్స్.. ప్రస్తుతం యూత్ ఫేవరేట్ డ్రింక్.. యూత్ కాదు.. చిన్న పిల్లలు సైతం ఎంతో ఇష్టంగా తాగుతున్నారు. మానసిక, శారీరక అలసటను తాత్కాలికంగా తగ్గించి, ఏకాగ్రతను పెంచుతాయని యూత్ నమ్మకం. కంపెనీలు కూడా అదే చెబుతున్నాయి. ఇవి తక్షణమే ఉత్తేజాన్నిచ్చి, అప్రమత్తతను,జ్ఞాపకశక్తి ఇస్తాయంటున్నాయి. అయితే ఎనర్జీ డ్రింక్స్ చిన్నపిల్లలు తాగితే మంచిది కాదని..ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆందోళనలు పెరుగుతున్న క్రమంలో  మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టింగ్, ఇతర ఎనర్జీ డ్రింక్స్ పై నిషేధం విధించింది. వివరాల్లోకి వెళితే.  

పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో స్టింగ్ సహా ఇతర ఎనర్జీ డ్రింక్స్, మత్తు పదార్థాల అమ్మకాలను నిషేధించింది.అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆహార, ఔషధ పరిపాలన శాఖ మంత్రి నర్హరి జిర్వాల్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులను ఆదేశించామని తెలిపారు. 

►ALSO READ | అమెరికాలో రూ.85 వేల ట్యాబ్లెట్.. ఇండియాలో కేవలం 35 రూపాయలకే.. యూఎస్ మహిళ వీడియో వైరల్

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చాలా ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫీన్, చక్కెర ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తాగితే పిల్లల్లో గుండె వేగం పెరగడం, నిద్రలేమి, ఆందోళన, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు ఎనర్జీ డ్రింక్స్ తాగితే కలిగే ఆరోగ్య సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని పాఠశాలలకు ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాలల సమీపంలో ఈ నిషేధాన్ని ఉల్లంఘించి ఎనర్జీ డ్రింక్స్ లేదా మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.