- మాజీ డీజీపీలు, అడిషనల్ డీజీలకు ముప్పు లేదు
- 26 మంది మాజీ పోలీస్ అధికారుల భద్రతపై పోలీస్ శాఖ నిర్ణయం
హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం లేకపోవడం.. ఇతర కారణాలతో మాజీ పోలీస్ అధికారుల భద్రత కుదింపుతో పాటు బుల్లెట్ ఫ్రూప్ వెహికల్స్ తొలగిస్తూ పోలీస్‌శాఖ కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలువురు మాజీ ప్రజాప్రతినిధులకు ముప్పు తీవ్రతను బట్టి భద్రత కుదించిన పోలీస్‌శాఖ.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డీజీపీలుగా అత్యంత కీలక స్థానాల్లో పనిచేసి రిటైర్ అయిన పలువురు మాజీ డీజీపీలకు సైతం బుల్లెట్ ఫ్రూప్ వాహనాలు తొలగించింది. ఈ జాబితాలో మాజీ డీజీపీలు స్వరన్‌జీత్ సేన్, ఏకే ఖాన్. ఏకే మహంతి, దినేష్ రెడ్డి, జితేందర్,అనురాగ్ శర్మ, పూర్ణచందర్రావు, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి , నవీన్ చంద్, రవిగుప్తా, డీటీ నాయక్‌తో పాటు మొత్తం 26 మందికి బుల్లెట్ ఫ్రూప్ వాహనాలను తొలగించినట్లు తెలిసింది.
ప్రవీణ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకోవద్దు
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్‌కు భద్రతలో భాగంగా కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ను వెనక్కి తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ వరకు వాహనాన్ని కొనసాగించాలని స్పష్టం చేసింది. పోలీసులు కల్పించిన భద్రతను ఉపసంహరించడాన్ని సవాలు చేస్తూ ప్రవీణ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ టి. మాధవీదేవి విచారణ చేపట్టారు. భద్రత ఉపసంహరణపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 7కు వాయిదా వేశారు.
జలగం ప్రసాదరావుకు భద్రతను కొనసాగించండి
మాజీ మంత్రి, సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేసిన జలగం ప్రసాదరావుకు ప్రస్తుతం ఉన్న భద్రతను వారంపాటు కొనసాగించాలంటూ ఖమ్మం పోలీసు కమిషనర్‌కు ఆదేశిస్తూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.1+1 భద్రతను ఉపసంహరించాలన్న నిర్ణయంపై జలగం ప్రసాదరావు గురువారం లంచ్‌మోషన్ వేశారు. దీనిని జస్టిస్ టి.మాధవీదేవి మధ్యాహ్నం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ తండ్రి జలగం వెంగళరావు మాజీ సీఎంగా నక్సలిజం ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించారని, అందువల్ల నక్సల్స్ వల్ల పిటిషనర్‌కు ప్రమాదం పొంచి ఉందన్నారు.
ప్రభుత్వ న్యాయవాది మహేశ్‌రాజె వాదనలు వినిపిస్తూ.. భద్రత సమీక్ష కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా భద్రతను ఉపసంహరించుకున్నామనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ పిటిషనర్‌కే భద్రత ఉపసంహరించారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. భద్రతా సమీక్ష కమిటీ ఇచ్చిన నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
