న్యూఢిల్లీ: ఒకవైపు ఇండియాకు క్రూడాయిల్ అమ్ముతున్న రష్యా, రిఫైన్ అయిన పెట్రోల్‌ను ఇక్కడి నుంచి భారీగా కొంటోంది. ఉక్రెయిన్ దాడుల కారణంగా ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతిని తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటుండడంతో మన దగ్గర నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటోంది.. రష్యాలోని 11 టైమ్ జోన్ల పరిధిలో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు , రేషనింగ్ వంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇండియా నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటోంది.
ఇప్పటికే భారత్ దాదాపు 60 వేల మెట్రిక్ టన్నుల గ్యాసోలిన్‌ను రష్యాకు పంపినట్లు సమాచారం. దాదాపు 40 వేల టన్నుల సామర్థ్యం ఉన్న రెండు ట్యాంకర్ల ద్వారా ఈ ఇంధనాన్ని రష్యాకు తరలించారు. గ్యాసోలిన్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో, రష్యా ప్రభుత్వం ఇతర దేశాల నుంచి తక్కువ ధరలకు ఇంధనాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. నెలకు సుమారు నాలుగు లక్షల టన్నుల గ్యాసోలిన్‌ను దిగుమతి చేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
