దీపావళి పర్వదినాన నిర్వహించే సంప్రదాయ ప్రత్యేక 'ముహురత్ ట్రేడింగ్' వేళల్లో మార్పులు చేయాలంటూ స్టాక్ బ్రోకర్లు మరోసారి ఎక్స్ఛేంజీలకు విజ్ఞప్తి చేశారు. గత ఏడాది మాదిరిగానే ఈసారీ కూడా దీపావళి రోజు పగటిపూటే ముహురత్ ట్రేడింగ్ నిర్వహించాలని బ్రోకర్ల ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఎక్స్ఛేంజీలకు అధికారికంగా ప్రతిపాదన పంపారు.
ఈ ఏడాది నవంబర్ 8న దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో.. ఆ రోజు మధ్యాహ్నం 1:47 నుండి 3:12 గంటల మధ్య శుభ ముహూర్తం ఉందని బ్రోకర్లు తెలిపారు. దీనికి అనుగుణంగా మధ్యాహ్నం 2:00 గంటల నుండి 3:00 గంటల మధ్య ట్రేడింగ్ సెషన్ నిర్వహించాలని కోరారు. అయితే దీనిపై చర్చిస్తున్న ఎక్స్ఛేంజీలు మధ్యాహ్నం 2:20 నుండి 3:20 గంటల వరకు ట్రేడింగ్ సమయాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనికంటే ముందుగా మధ్యాహ్నం 1:50 నుండి 2:05 వరకు బ్లాక్ డీల్ విండో, 2:05 నుండి 2:20 వరకు ప్రీ-ఓపెన్ సెషన్ ఉండే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక సర్క్యులర్ రావొచ్చు.
ALSO READ : అమెరికాలో పిల్లలందరికీ స్పేస్ఎక్స్ షేర్లు ఫ్రీగా ఇస్తా: ఎలాన్ మస్క్ సంచలన ఆఫర్
సాధారణంగా దశాబ్దాలుగా సాయంత్రం పూట మాత్రమే ముహురత్ ట్రేడింగ్ నిర్వహించేవారు. కానీ గత సంవత్సరం మొదటిసారిగా దీనిని మధ్యాహ్నం 1:45 నుండి 2:45 గంటల మధ్య నిర్వహించారు. ఇదే పద్ధతిని ఈసారి కూడా కొనసాగించాలని అసోసియేషన్ ఆఫ్ ఎన్ఎస్ఈ మెంబర్స్ ఆఫ్ ఇండియా(ANMI), ధన్ ఫౌండర్ జయ్ ప్రకాష్ గుప్తాతో పాటు పలువురు ప్రముఖులు కోరుతున్నారు.
సాయంత్రం పూట ట్రేడింగ్ నిర్వహించడం వల్ల బ్రోకింగ్ సంస్థలు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలు, బ్యాంట్ ఉద్యోగులు రాత్రి వరకు ఆఫీసుల్లోనే ఉండిపోవాల్సి వస్తోందని బ్రోకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రేడింగ్ ముగిసిన తర్వాత కూడా పోస్ట్-ట్రేడ్ కంప్లైయన్స్, ఫండ్ అలొకేషన్లు, ఎర్లీ పే-ఇన్ వంటి పనులతో రాత్రి ఆలస్యం అవుతోందని.. దీనివల్ల వేలాది మంది ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి దీపావళి పండుగను ఆస్వాదించలేకపోతున్నారని వాపోతున్నారు.
సంప్రదాయాన్ని గౌరవిస్తూనే.. మార్కెట్ నిపుణులు, ఉద్యోగులు తమ కుటుంబాలతో సంతోషంగా పండుగను జరుపుకునేందుకు పగటిపూట ముహురత్ ట్రేడింగ్ ఎంతో ఉపయోగపడుతుందని బ్రోకర్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఎక్స్ఛేంజీలు ఈ ప్రతిపాదనను ఎలా ఆమోదిస్తాయో వేచి చూడాల్సిందే.
