బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అదరగొట్టిన రింకు సింగ్.. భారత జట్టులో చోటు దక్కేనా?

బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అదరగొట్టిన రింకు సింగ్.. భారత జట్టులో చోటు దక్కేనా?

Rinku Singh Ranji Trophy: టీ20 క్రికెట్‌లో తన సిక్సర్లతో ప్రపంచవ్యాప్తంగా ది బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఉత్తరప్రదేశ్ స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ (Rinku Singh), ఇప్పుడు రెడ్ బాల్ (ఫస్ట్ క్లాస్) క్రికెట్‌లోనూ అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. రంజీ క్రికెట్లో 2026-27 సీజన్‌లో వరుసగా రెండో సెంచరీ సాధించాడు. గోవాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఒంటరిగా రింకూ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కనీసం 50 ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాటర్లలో అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ ఉన్న టాప్-10 ప్లేయర్స్ లిస్టులో 9వ స్థానానికి ఎగబాకాడు. ఈ ఆల్-టైమ్ గ్రేట్ జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

గోవాతో మ్యాచ్‌లో ఒంటరి పోరాటం: 

గోవాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ టీమ్ బ్యాటింగ్ విభాగం ఘోరంగా విఫలమైంది. వరుసగా వికెట్లు కోల్పోయి ఒక దశలో 137 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అత్యంత సంయమనం ప్రదర్శిస్తూ 118 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. చివరి వికెట్‌కు వంశ్ చౌదరితో కలిసి విలువైన పరుగులు జోడించి జట్టు స్కోరును 202 పరుగులకు చేర్చాడు.

వినోద్ కాంబ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన రింకు: 

ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో బీహార్‌పై 112 రన్స్ చేసిన రింకూ, తాజాగా గోవాపై 118 నాటౌట్‌తో వరుసగా రెండో శతకాన్ని నమోదు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో రింకూ ఫస్ట్ క్లాస్ బ్యాటింగ్ సగటు 61.33కు పెరిగింది. దీంతో అంతకుముందు 59.67 సగటుతో ఉన్న భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ రికార్డును రింకూ సింగ్ బ్రేక్ చేసేశాడు. ఇప్పటి వరకు 55 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన రింకూ, 78 ఇన్నింగ్స్‌ల్లో 3,987 పరుగులు బాదేశాడు. ఇందులో 11 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్‌గానూ అతను నిలిచాడు.

ఫస్ట్ క్లాస్ ఆల్-టైమ్ హైయెస్ట్ యావరేజ్ జాబితా: 

* డాన్ బ్రాడ్‌మన్ – 95.14
* విజయ్ మర్చంట్ – 71.64
* జార్జ్ హెడ్లీ – 69.86
* అజయ్ శర్మ – 67.46
* విలియం పాన్స్ఫోర్డ్ – 65.18
* విలియం వుడ్‌ఫుల్ – 64.99
* శాంతను సుగ్వేకర్ – 63.10
* సర్ఫరాజ్ ఖాన్ – 62.92
* రింకూ సింగ్ – 61.33
* కే.సీ.ఇబ్రహీం – 61.24

లాస్ట్11 ఇన్నింగ్స్‌ల్లో రింకు కిరాక్ ఫామ్: 

రింకూ సింగ్ తన చివరి 11 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 850 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌ల సగటు 94.44గా ఉండటం విశేషం. కేవలం టీవీల్లో సిక్సర్లు కొట్టే ప్లేయర్‌గానే కాకుండా, రెడ్ బాల్ క్రికెట్‌లోనూ తాను నిలకడగల బ్యాటర్‌నని రింకూ నిరూపించుకుంటున్నాడు. ఈ సూపర్ ఫామ్ చూశాక, భారత టెస్టు జట్టులోకి అతనికి పిలుపు వస్తుందనే చర్చ క్రికెట్ వర్గాల్లో జోరుగా కొనసాగుతోంది.