ఇండియాలో నెలకు రూ.80వేలు సంపాదిస్తున్నారంటే మీరు దేశంలోని టాప్ 10 శాతం సంపన్నుల జాబితాలో ఉన్నట్లే తెలుసా. అవునండీ బాబు వినడానికి ఇది చాలా పెద్దదిగా అనిపించినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలతో బేరీజు వేస్తే మన దేశ ఆర్థిక స్థితిగతుల అసలు రూపం బయటపడతుంది. ప్రపంచ బ్యాంకుకు చెందిన 2026 నాటి పావర్టీ అండ్ ఇన్‌ఈక్వాలిటీ ప్లాట్‌ఫామ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. భారత్‌లో సంపన్నులుగా భావించే టాప్ 10 శాతం మంది జీవన ప్రమాణాలు, ప్రపంచంలోని అగ్రరాజ్యాల్లోని అత్యంత పేదవారి జీవన ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉన్నాయట. ఒక దేశంలో పైస్థాయిగా ఉన్నదే, మరో దేశంలో అడుగు స్థాయిగా మారుతుందనే పాపులర్ సామెతకు ఇది అద్దం పడుతోంది.
పేదరిక నిర్మూలనలో భారత్..
గత దశాబ్ద కాలంలో భారత్ అత్యంత వేగంగా పేదరిక నిర్మూలనలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. రోజుకు 3 డాలర్ల అంటే దాదాపు రూ. 285 బెంచ్‌మార్క్ గా తీసుకుంటే.. దేశంలో పేదరికం 2011-12 నాటికి 27.1 శాతంగా ఉండగా.. 2023-24 నాటికి అది కేవలం 2.6 శాతానికి పడిపోయింది. అలాగే దిగువ-మధ్య ఆదాయ పరిమితి అయిన రోజుకు 4.2 డాలర్లు అంటే రూ. 400 కంటే దిగువన ఉన్నవారు 57.7 శాతం నుంచి 16.1 శాతానికి తగ్గిపోయారు. దీనివల్ల దాదాపు 50 కోట్ల మంది పావర్టీ రేఖను దాటి పైకి రాగలిగారు. ఆహార భద్రత, ప్రభుత్వ సబ్సిడీలు, మౌలిక వసతులు మెరుగుపడటం ఇందుకు ప్రధాన కారణం.
గ్లోబల్ బెంచ్‌మార్క్‌తో పోలిస్తే మన టాప్ టెన్ ఎక్కడ?
భారత్‌లో టాప్ 10 శాతం సంపన్నులలో ఒకరిగా నిలవాలంటే రోజుకు కొనుగోలు శక్తి పరంగా దాదాపు 10 డాలర్లు అంటే రూ.951 ఖర్చు చేయగలిగే స్థోమత ఉండాలి. కానీ.. అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కేవలం అట్టడుగున ఉన్న పేద 10 శాతం మంది ప్రజలే రోజుకు 25 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 2వేల 377 నుండి 31 డాలర్లు అంటే రూ. 2వేల 948 వరకు వెచ్చిస్తున్నారు. అమెరికాలో టాప్ 10 శాతం సంపన్నుల రోజువారీ ఖర్చు ఏకంగా 173 డాలర్లు అంటే రూ.16వేల 454గా ఉంది. దీనిని బట్టి భారత్‌లో మేము డబ్బున్నోళ్లం అని భావించేవారు సైతం సంపన్న దేశాల్లోని పేదవారి కంటే తక్కువ జీవన ప్రమాణాలను కలిగి ఉన్నట్లు స్పష్టమైంది.
అయితే.. వివిధ దేశాల మధ్య మారకం విలువలు, వస్తువుల ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవిస్ పేర్కొన్నారు. అమెరికాలో ఒక బర్గర్ ధర రూ.500 ఉంటే, భారత్‌లో అది రూ.150-200 మాత్రమే ఉంటుంది. కాబట్టి కేవలం ఆదాయాన్ని బట్టి జీవన ప్రమాణాలను నేరుగా పోల్చలేమని ఆయన పేర్కొన్నారు.
ALSO READ : పెళ్లికి ముందు నుంచే లక్షల్లో అప్పు.. భార్య దగ్గర ఈ నిజం దాచేశారా..?
రియల్ ఎర్నింగ్స్ లోనే చిక్కులు..
దేశంలో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. 2017-2023 మధ్య కాలంలో దాదాపు కోటి 34లక్షల మంది కొత్తగా ఉపాధి పొందారు. ఇందులో గ్రామీణ మహిళల భాగస్వామ్యం కూడా ఎక్కువే. అయితే ఉద్యోగాలు వస్తున్నప్పటికీ వాటి ఉత్పాదకత, నాణ్యత మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. దీనివల్ల రియల్ ఎర్నింగ్స్ ఆశించిన మేర వృద్ధి చెందలేదు. ఇదే క్రమంలో భారతదేశంలోని టాప్ 10 శాతం మంది వద్దే జాతీయ సంపదలో 65 శాతం కేంద్రీకృతమై ఉందని వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్ చెబుతోంది.
వికసిత్ భారత్ 2047..
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే కేవలం సంక్షేమ పథకాలే సరిపోవు. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా వృద్ధి చెందాలి. ఐటీ రంగం దూసుకుపోతున్నప్పటికీ.. ఉపాధిని ఎక్కువగా సృష్టించే వస్త్ర పరిశ్రమ, మ్యానుఫ్యాక్చరింగ్ మరింత బలపడాలి. వ్యవసాయ రంగం నుంచి కార్మికులను మెరుగైన ఉపాధి మార్గాల వైపు మళ్లించే నిర్మాణాత్మక సంస్కరణలు రావాలి. GDP వృద్ధిని దీర్ఘకాలం పాటు నిలకడగా కొనసాగిస్తేనే తలసరి ఆదాయం పెరిగి, ప్రజల జీవన ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటాయని మన పాలకులు గుర్తించాలి. ఇండియా ఎదగటానికి ఇదొక్కటే మార్గం.
