అమెరికాలో పిల్లలందరికీ స్పేస్‌ఎక్స్ షేర్లు ఫ్రీగా ఇస్తా: ఎలాన్ మస్క్ సంచలన ఆఫర్

అమెరికాలో పిల్లలందరికీ స్పేస్‌ఎక్స్ షేర్లు ఫ్రీగా ఇస్తా:  ఎలాన్ మస్క్ సంచలన ఆఫర్

స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించే ప్రకటన చేశారు. అమెరికాలోని ప్రతి చిన్నారికి తన రాకెట్ అండ్ శాటిలైట్ కంపెనీ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఒక షేర్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన మస్క్.. వచ్చే ఏడాది నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అమెరికన్ యువతను స్టాక్ మార్కెట్ ఓనర్‌షిప్ వైపు తీసుకురావడానికి ఇది తొలి అడుగని పేర్కొన్నారు మస్క్.

ఈ ఏడాది జూన్ 12న స్పేస్ ఎక్స్ కంపెనీ నాస్‌డాక్ మార్కెట్‌లో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 2002లో స్థాపించినప్పటి నుంచి ప్రైవేట్‌గానే కొనసాగిన ఈ సంస్థ.. ఐపీఓ ద్వారా సుమారు 85.7 బిలియన్ డాలర్ల నిధులను సేకరించి చరిత్ర సృష్టించింది. ఇష్యూ సమయంలో షేరు ధరను 135 డాలర్లుగా నిర్ణయించగా.. ప్రస్తుతం ధర 146 డాలర్లకు పైగా ట్రేడవుతోంది. ఇలా కంపెనీ స్టాక్ మార్కెట్లోకి వచ్చి కేవలం 4 నెలలు గడవక ముందే మస్క్ ఫ్రీ షేర్ల ప్రకటన చేయడం సంచలనంగా మారింది. 

ఈ ఉచిత షేర్ల పంపిణీకి సంబంధించి ఎలాన్ మస్క్ పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఏ వయసు పిల్లలు అర్హులు, షేర్లను నేరుగా పిల్లలకు బదిలీ చేస్తారా లేక తల్లిదండ్రుల ఆధ్వర్యంలో మేనేజ్ చేసే అకౌంట్లలో జమ చేస్తారా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ అమెరికాలోని కోట్లాది మంది చిన్నారులకు స్టాక్ మార్కెట్ పరిచయం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ALSO READ : అమెరికాలో రోడ్డున పడుతున్న NRI టెక్కీలు..

స్పేస్ ఎక్స్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. రీసెలబుల్ రాకెట్లు, స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ నెట్‌వర్క్, స్టార్‌షిప్ ప్రాజెక్ట్‌లతో అంతరిక్ష రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఎలాన్ మస్క్.. ఇప్పుడు చిన్నారులకు కూడా కంపెనీలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా మరో సరికొత్త ట్రెండ్‌కు తెరతీశారు. వచ్చే ఏడాది ఈ ఉచిత షేర్ల ప్లాన్ ఎలా అమలవుతుందనే అంశంపై అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.