బంగారం కోసం వృద్ధురాలి హత్య... 2 తులాల బంగారం, 50 తులాల వెండి చోరీ చేసి చంపేశారు..

బంగారం కోసం వృద్ధురాలి హత్య... 2 తులాల బంగారం, 50 తులాల వెండి చోరీ చేసి చంపేశారు..
  • సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఘటన

కోహెడ,వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లి గ్రామంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలు(90)ను గుర్తుతెలియని దుండగులు హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న రెండు తులాల బంగారు గుండ్లు, కాళ్లకు ఉన్న 50 తులాల వెండి కడియాలను దోచుకెళ్లారు. గ్రామంలోని అప్పిస కాలనీకి చెందిన అప్పిస బుచ్చవ్వకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. భర్త పదేళ్ల క్రితమే చనిపోయాడు. దీంతో తల్లిని పాత ఇంట్లోనే ఉంచి సాకుతున్నారు. 

బుధవారం రాత్రి భోజనం చేసి నిద్రపోయిన తర్వాత బుచ్చవ్వ ఇంట్లోకి దుండగులు చొరబడ్డారు. చీర కొంగుతో మెడ బిగించి హత్య చేసి, మెడలో ఉన్న బంగారు గుండ్లు, కాళ్ల కడియాలను తీసుకుని పరారయ్యారు. గురువారం ఉదయం చిన్న కోడలు స్వరూప చాయ్ ఇచ్చేందుకు వెళ్లగా, బుచ్చవ్వ మంచంపై కదలకుండా కనిపించింది. 

వంటిపై నగలు లేకపోవడంతోపాటు ముక్కు నుంచి రక్తం వస్తుండడంతో గమనించి కుటుంబీకులకు తెలియజేసింది. వారు వచ్చి చూడగా అప్పటికే బుచ్చవ్వ మృతి చెందగా లబోదిబోమని విలపించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా సిద్దిపేట పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.  కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.