- ఏండ్లుగా భారత్ సరిహద్దు ఉగ్రవాదానికి బలవుతూనే ఉంది
- ఐక్యరాజ్యసమితిలో భారత్ సందేశం
న్యూయార్క్: ‘ఉగ్రవాది అంటే ఉగ్రవాదే’నని, ఉగ్రవాదాన్ని సమర్థించే ఎలాంటి ద్వంద్వ వైఖరినైనా అంతర్జాతీయ సమాజం దూరం పెట్టాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదుల్లో ‘మంచి ఉగ్రవాది.. చెడ్డ ఉగ్రవాది’ ఉండరని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితిలో గురువారం ‘ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ (జీసీటీఎస్)’ తొమ్మిదో సమీక్ష ఆమోదం సందర్భంగా భారత ప్రతినిధి హరీష్ పర్వతనేని మాట్లాడారు. భారత్ దశాబ్దాలుగా సరిహద్దు దాటి వస్తున్న ఉగ్రవాద చర్యలకు బలౌవుతూనే ఉందన్నారు.
వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారని, అనేక కుటుంబాలు నష్టపోయాయని అన్నారు. ఈ అనుభవాలే ఉగ్రవాదంపై భారత్ వైఖరిని నిర్దేశించాయని తెలిపారు. ఉగ్రవాదానికి పాల్పడిన వారిని, కుట్రదారులను, నిధులు సమకూర్చిన వాళ్లను, ప్రోత్సహిస్తున్న వారందరినీ చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి దేశంపై ఉందన్నారు. ఈ విషయంలో సభ్య దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలన్నారు. మొదటి మానవ హక్కు అయిన జీవించే హక్కుపైనే ఉగ్రవాదం ప్రత్యక్ష దాడి చేస్తున్నదని పేర్కొన్నారు.
