ఎగిరిపోతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. ఏఐ వల్ల లేఆఫ్స్‌లో 2వ స్థానంలో భారత్

ఎగిరిపోతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. ఏఐ వల్ల లేఆఫ్స్‌లో 2వ స్థానంలో భారత్

ప్రపంచాన్ని ఏఐ శాసిస్తున్న వేళ.. ఐటీ రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు టెక్ గైడ్స్‌గా వెలిగిన దిగ్గజ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగులకు 'పింక్ స్లిప్స్' ఇస్తూ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. ఈ రేసులో ప్రముఖ గ్లోబల్ టెక్ సంస్థ ఒరాకిల్ చేరిపోయింది. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. మానవ వనరుల అవసరాన్ని తగ్గించుకునే క్రమంలో ఒరాకిల్ భారీగా లేఆఫ్స్ ప్రకటించింది. ఈ దెబ్బతో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుండగా.. మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం త్వరలోనే తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకోవడానికి పక్కా ప్లాన్‌తో సిద్ధమవుతోంది.

టెక్ ప్రపంచంలో ఈ లేఆఫ్స్ సునామీ ఎంతలా ఉందో చెప్పడానికి Layoffs.fyi అనే లైవ్ ఆన్‌లైన్ ట్రాకర్ లెక్కలే నిదర్శనం. 2026 సంవత్సరం జూలై 1 నాటికే జరిగిన ఉద్యోగాల కోత, గత 2025 పూర్తి ఏడాదిలో జరిగిన మొత్తం లేఆఫ్స్‌ను దాటేసిందంటే పరిస్థితి ఎంత దారణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏఐ అడాప్షన్ కారణంగా కంపెనీలు రోబోటిక్ స్పీడ్‌తో పనులు కానిస్తూ.. ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. నిన్నటివరకు కోడింగ్, ప్రోగ్రామింగ్ చేసిన చేతులకు కొత్తకొత్త ఏఐ టూల్స్ బైబై చెప్పేస్తుండటం ఐటీ సర్కిల్స్‌లో ఒక పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

2020 నుంచి జరుగుతున్న ఈ ఉద్యోగాల తొలగింపు ట్రెండ్‌ను పరిశీలిస్తే.. ప్రపంచవ్యాప్తంగా రిటైల్, హార్డ్‌వేర్ రంగాలు అత్యధికంగా దెబ్బతిన్నాయి. మొత్తం టెక్ పరిశ్రమ లేఆఫ్స్‌లో ఈ రెండు రంగాలే దాదాపు 23 శాతం వాటాను కలిగి ఉండటం గమనార్హం. అంతేకాదు ఈ లేఆఫ్స్ సునామీకి కేరాఫ్ అడ్రస్‌గా అమెరికా నిలిచింది. 2020 నుంచి జరిగిన ప్రతి నాలుగు లేఆఫ్స్‌లో దాదాపు మూడు యూఎస్ కంపెనీల నుంచే జరిగాయి. ఇక ఈ గ్లోబల్ లిస్టులో మన భారతదేశం 7.16 శాతం వాటాతో 2వ స్థానంలో నిలిచి టెక్కీలను ఆందోళనకు గురిచేస్తోంది.

ALSO READ : రెండో రోజూ షాకిచ్చిన బంగారం.. 10 గ్రాములకు రూ.3వేల 220 పెరిగిన గోల్డ్

ఈ ఏఐ తుఫాన్ కేవలం సాఫ్ట్‌వేర్ కంపెనీలకే పరిమితం కాలేదు. ఎడ్యుకేషన్ రంగాన్ని కూడా కుదిపేసింది. మొత్తం లేఆఫ్స్‌లో ఎడ్యుకేషన్ రంగం ఏకంగా 20 శాతానికి పైగా వాటాను నమోదు చేసింది. లెర్నింగ్ యాప్స్, ఆన్‌లైన్ ట్యూటరింగ్ లను ఏఐ బాట్లు వేగంగా రీప్లేస్ చేస్తుండటమే దీనికి ప్రధాన కారణం. 2020 నుంచి ప్రారంభమైన ఈ ఏఐ విప్లవం, ఇప్పుడు అన్ని రంగాల్లోని ఉద్యోగుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తూ.. సరికొత్త డిజిటల్ శకానికి నాంది పలుకుతోంది.