టోల్ బూత్ ను ఢీకొన్న LPG గ్యాస్ ట్యాంకర్... భారీ పేలుడు.. 24 సెకన్ల వీడియోలో విధ్వంసం..

టోల్ బూత్ ను ఢీకొన్న LPG గ్యాస్ ట్యాంకర్... భారీ పేలుడు.. 24 సెకన్ల వీడియోలో విధ్వంసం..

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలోLPG గ్యాస్ లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ ఒక టోల్ బూత్‌ను ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా... పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూన్ 26న ఉదయం 6:40 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ శుక్రవారం ( జులై 3 ) ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...

24 సెకన్ల నిడివి గల వీడియోలో, రెండు ట్యాంకర్లు టోల్ బూత్ వైపు వస్తుండగా, వాటిలో ఒకటి అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొట్టి టోల్ ప్లాజాలోకి దూసుకెళ్లింది. ట్యాంకర్ నుండి గ్యాస్ లీక్ అవ్వడంతో భారీ పేలుడు సంభవించింది. కొద్ది క్షణాలకే, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. మంటలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే... అవి సుమారు రెండు కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించాయని సమాచారం.

మంటలను అదుపులోకి తీసుకురావడానికి జిల్లాలోని అన్ని స్టేషన్ల నుండి ఫైర్ సిబ్బంది, పోలీసులు భారీగా మోహరించినట్లు తెలిపారు పోలీసులు 40 ఏళ్ల ధర్మేంద్ర దుబే అనే డ్రైవర్, అలోక్ అనే టోల్ ప్లాజా ఉద్యోగి అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. టోల్ ప్లాజాలోని ఇతర కార్మికులు పలువురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు తర్వాత మరణించినట్లు సమాచారం.

ఘటన జరిగిన సమయంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు , వాహనాలను టోల్ ప్లాజా గుండా ఉచితంగా వెళ్ళడానికి అనుమతించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.