ఒక్క క్లిక్‌తో ఈ-రిక్షా బంద్? BAT-BMS యాప్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం

ఒక్క క్లిక్‌తో ఈ-రిక్షా బంద్? BAT-BMS యాప్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం

సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన కొన్ని వీడియోలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఆ వీడియోల్లో కొందరు వ్యక్తులు రోడ్డుపై వెళ్తున్న ఈ-రిక్షాల వద్దకు వెళ్లి BAT-BMS అనే మొబైల్ యాప్ ద్వారా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు కనెక్ట్ అవుతూ.. వాహనాన్ని ఒక్కసారిగా నిలిపివేస్తున్న ఘటనలు కనిపించాయి. దీంతో డ్రైవర్లు అయోమయానికి గురవడం, వారి రియాక్షన్ పై వీడియోలు తీయటం తీవ్ర చర్చకు దారితీసింది.

ప్రభుత్వం కీలక ఆదేశాలు..
ఈ ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా BAT-BMS యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌ల నుంచి తొలగించాలని ఆదేశించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రెండు యాప్‌లను తొలగించినట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. రవాణా శాఖతో పాటు ఢిల్లీ పోలీసులను వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించింది. రవాణా మంత్రి పంకజ్ సింగ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

డ్రైవర్ల ఆందోళన..
మొరాదాబాద్‌లో ఓ ఈ-రిక్షా డ్రైవర్ తన వాహనం యాప్ ద్వారా లాక్ అయిందని ఆరోపిస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. మరోవైపు సోషల్ మీడియాలో పలువురు ఈ యాప్‌పై వెంటనే నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ వ్యక్తి ఈ తరహా యాప్‌తో ఈ-రిక్షాలను నిలిపివేసి, డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేసిన ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.

కార్లకు ఎందుకు ప్రమాదం లేదు?
ఈ వివాదం మధ్య టాటా మోటార్స్ షోరూంలో లైవ్ డెమో ద్వారా తమ ఎలక్ట్రిక్ కార్లు ఈ సమస్యకు గురికావని వివరించారు. కార్లలో ఉపయోగించే బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పూర్తిగా ఎన్‌క్రిప్ట్ చేయబడిన క్లోజ్డ్-లూప్ టెక్నాలజీతో పనిచేస్తుందని, అయితే కొన్ని ఈ-రిక్షాల్లో మాత్రం బ్లూటూత్ ఆధారిత వ్యవస్థల్లో భద్రతా లోపాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రభుత్వం BAT-BMS యాప్‌ను తొలగించడానికి ప్రధాన కారణాలు భద్రతా లోపాలు, దుర్వినియోగం జరిగే అవకాశం, డ్రైవర్ల జీవనోపాధిపై ప్రభావం, ప్రజా భద్రతకు ముప్పు, విదేశీ మూలాలున్న యాప్‌పై వ్యక్తమైన అనుమానాలే కీలక అంశాలుగా ఉన్నాయి. ఎవరైనా అనుమతి లేకుండా వాహనాలను నియంత్రించే పరిస్థితి ఏర్పడితే ప్రమాదాలు, ట్రాఫిక్ అంతరాయం, ఆర్థిక నష్టం సంభవించే అవకాశముందని ప్రభుత్వం భావించింది. అందుకే ముందస్తు జాగ్రత్త చర్యగా యాప్‌ను తొలగిస్తూ విచారణ పూర్తయ్యే వరకు నిఘా కొనసాగించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.