రాంచీ: జార్ఖండ్లో గడచిన 24 రోజులుగా విద్యార్థులు నిద్రాహారాలు మాని చేస్తున్న నిరసనలతో ప్రభుత్వం దిగొచ్చింది. విద్యార్థుల డిమాండ్లకు తలొగ్గింది. JSSC-CGL పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పరీక్షను రద్దు చేసినట్లు సోమవారం రోజు ప్రకటించారు.
2014 నుంచి జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన పరీక్షలపై విచారణ జరుపుతామని, పరీక్షల నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. JSSC-CGL పరీక్షతో సహా TDPL నిర్వహించే అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రభుత్వం స్పందించాలని దీక్ష చేస్తున్న దేవేంద్ర నాథ్ మహ్తో ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడం, పరీక్ష రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో దీక్ష విరమించారు.
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ)ను, సివిల్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలని, నియామక పరీక్షల్లో అక్రమాలపై సీబీఐ లేదా రాష్ట్రం వెలుపల ఉన్న హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో విచారణ జరపాలని స్టూడెంట్స్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
అలాగే జేపీఎస్సీ, జేఎస్సీఎస్సీల్లో సంస్కరణలు చేపట్టాలన్నది విద్యార్థుల ప్రధాన డిమాండ్. రాష్ట్ర శాసనసభ ముట్టడికి కూడా విద్యార్థులు యత్నించిన సంగతి తెలిసిందే. విద్యార్థులపై లాఠీ ఛార్జ్తో జార్ఖండ్ విద్యార్థుల నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
