ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.. వర్షంలో తగ్గని భక్తుల ఉత్సాహం.. తొలిరోజే 20 వేల మందిపైగా..

ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.. వర్షంలో తగ్గని భక్తుల ఉత్సాహం.. తొలిరోజే 20 వేల మందిపైగా..

దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో, సుమారు 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ యాత్ర శుక్రవారం తెల్లవారుజామున మొదలైంది. బల్తాల్, నున్వాన్ అనే రెండు బేస్ క్యాంపుల నుండి భక్తుల ఈ యాత్ర ప్రయాణం సాగుతుందని అధికారులు తెలిపారు. 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 28తో ముగుస్తుంది. దీనికోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ ఉదయాన్నే ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నా సరే, భక్తులు ఉత్సాహంగా యాత్రను ప్రారంభించారు. అమర్‌నాథ్ దేవాలయానికి  చేరుకోవడానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి- పాత కాలం నుండి వస్తున్న 48 కిలోమీటర్ల నున్వాన్-పహల్గామ్ దారి, రెండోది- 14 కిలోమీటర్ల బల్తాల్ దారి.

దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్‌లో ఉన్న నున్వాన్ క్యాంప్ నుండి, అలాగే మధ్య కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లా సోనామార్గ్ దగ్గర ఉన్న బల్తాల్ క్యాంప్ నుండి పురుషులు, మహిళలు, సాధువులతో కూడిన భక్తుల టీం తెల్లవారుజామునే బయలుదేరాయి. అక్కడ ఉన్న అధికారులు  జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు.  అంతకుముందు గురువారం రోజే, జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుండి 4,809 మంది భక్తుల మొదటి బృందాన్ని అనుమతించారు.  

భక్తుల రక్షణ కోసం పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇతర సైనిక దళాలకు చెందిన వేల మంది సిబ్బందిని భద్రతగా పెట్టారు. అంతేకాకుండా, పైనుండి హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా కూడా నిఘా పెట్టారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు అమర్‌నాథ్ మంచు లింగాన్ని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

అమర్‌నాథ్ యాత్ర విశేషాలు
*అమర్‌నాథ్ యాత్ర కట్టుదిట్టమైన భద్రత మధ్య శుక్రవారం తెల్లవారుజామున అధికారికంగా ప్రారంభమైంది.
* 57 రోజుల పాటు సాగే ఈ పుణ్యక్షేత్ర యాత్ర ఆగస్టు 28న ముగుస్తుంది.
*దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో, 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుహాలో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు లింగం ఉంటుంది.

అమర్‌నాథ్ ముఖ్యమైన మార్గాలు:
* పహల్గామ్ నుండి (నున్వాన్ బేస్ క్యాంప్ నుండి  48 కిలోమీటర్లు)
*బల్తాల్ నుండి (గాందర్‌బల్ బేస్ క్యాంప్ నుండి 14 కిలోమీటర్లు)

భద్రతా చర్యలు
*భక్తుల రక్షణ కోసం అధికారులు ఇంతకుముందు  కంటే పైగానే భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు:

*పోలీసులు, CRPF,  పారామిలిటరీ దళాలకు చెందిన వేల మంది సిబ్బందిని మోహరించారు.

*హైటెక్ నిఘాతో పాటు, రెండు మార్గాలను 'నో-ఫ్లై జోన్‌'గా ప్రకటించారు. నిఘా టవర్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.

*QR కోడ్ గుర్తింపు కార్డులు: ఉగ్రవాదులు సహాయకుల రూపంలో చొరబడకుండా ఉండటానికి... గుర్రపు స్వారీ చేసేవారు, స్థానికులతో సహా అందరికీ ట్యాంపర్-ప్రూఫ్ QR కోడ్ ఉన్న ఐడీ కార్డులు ఇచ్చారు.

RFID ట్యాగ్‌లు: యాత్రికుల వాహనాలు, భక్తుల కదలికలను లైవ్‌లో (రియల్ టైం) ట్రాక్ చేయడానికి RFID ట్యాగ్‌లను వాడుతున్నారు.

ALSO READ : సూర్యాస్తమయం అయ్యాక ఇల్లు ఊడుస్తున్నారా ? లక్ష్మీదేవి ఆగ్రహిస్తే దరిద్రం తప్పదు.. 

భక్తులకు కీలక ఆదేశాలు జారీ :
*భక్తులు భద్రతా సిబ్బంది, అధికారులు చెప్పే సూచనలను ఖచ్చితంగా పాటించాలి.
*అధికారులు అనుమతించిన  కాన్వాయ్‌ లో మాత్రమే ప్రయాణించాలి.
*ప్రతి ఒక్కరూ వారి గుర్తింపు పేపర్స్ (ID Cards) ఉంచుకోవాలి.
*ఎలాంటి పుకార్లను నమ్మవద్దు, వాటిని ఇతరులకు వ్యాప్తి చేయవద్దు.
*ఏదైనా అనుమానాస్పద వస్తువు లేదా వ్యక్తి కనిపిస్తే వెంటనే సమీపంలోని పోలీసులకు లేదా అత్యవసర హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలి.