బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి గురువారం ఈ–-మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ ఆఫీసుకు ఈ-–మెయిల్ అందినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్ సిబ్బందితో కలిసి కార్యాలయం మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది..? దీని వెనుక ఉన్న వ్యూహం ఏమిటి..? అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.
