సౌతాఫ్రికాని ఓడించిన ఇంగ్లాండ్.. ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో బ్లాక్‌బస్టర్ పోరు

సౌతాఫ్రికాని ఓడించిన ఇంగ్లాండ్.. ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో బ్లాక్‌బస్టర్ పోరు

ICC Women’s T20 World Cup: మహిళల టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు అద్భుత విజయం సాధించింది. గురువారం (జులై 2న) కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో సౌతాఫ్రికాపై 40 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. గత 2023 టీ20 వరల్డ్ కప్, 2025 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌లో సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయాలకు ఇంగ్లాండ్ ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. జూలై 5న లార్డ్స్ మైదానంలో జరగబోయే ప్రతిష్టాత్మక ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ తలపడనుంది.

ఇంగ్లాండ్ రికార్డు భాగస్వామ్యం: 
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలో గట్టి షాక్‌లు తగిలాయి. సౌతాఫ్రికా బౌలర్లు మరిజానే కాప్, షబ్నిమ్ ఇస్మాయిల్ ధాటికి పవర్‌ప్లే ముగిసేసరికి ఇంగ్లాండ్ 22 రన్స్ కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఇస్మాయిల్.. అమీ జోన్స్‌ను అవుట్ చేయడంతో మహిళల టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించింది. ఈ దశలో గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన కెప్టెన్ నాట్ సివర్-బ్రంట్ (47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్‌తో 75 పరుగులు) , మాజీ కెప్టెన్ హీథర్ నైట్‌ (47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 58 పరుగులు)తో కలిసి ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నిర్మించింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 133 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ చరిత్రలోనే ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.

ALSO READ : వైభవ్ సూర్యవంశీని ఆడించాల్సింది.. ప్యాంట్లు ఊడగొట్టేవాడు: రవిశాస్త్రి

చేతులెత్తేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు: 
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు లారా వోల్వార్డ్ (17), తజ్మిన్ బ్రిట్స్ (51) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్‌కు 43 పరుగులు జోడించిన తర్వాత వోల్వార్డ్‌ను లిన్సే స్మిత్ అవుట్ చేసి బ్రేక్ త్రూ ఇచ్చింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సౌతాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టారు. చార్లీ డీన్ ప్రమాదకరమైన బ్రిట్స్, మరిజానే కాప్‌లను అవుట్ చేయగా, లారెన్ బెల్, ఫ్రేయా కెంప్, సోఫీ ఎక్లెస్టోన్ తలో వికెట్ తీసి సౌతాఫ్రికా బ్యాటింగ్ లైన్‌అప్‌ను దెబ్బతీశారు. సౌతాఫ్రికా జట్టులో బ్రిట్స్ (51) మినహా మరెవ్వరూ రాణించలేకపోయారు. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 130 పరుగులకే పరిమితమై, 40 రన్స్ తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. టోర్నీలో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్లు ఇప్పుడు ట్రోఫీ కోసం ఫైనల్లో పోటీపడనున్నాయి.