- రూ.9,500 కోట్లు సేకరించాలని చూస్తున్న పార్లే ప్రొడక్ట్స్
- ఐపీఓ పేపర్లు ఫైల్ చేసిన రత్నదీప్, కార్ల్స్‌బర్గ్
న్యూఢిల్లీ: అన్‌లిస్టెడ్ మార్కెట్‌లోని కొన్ని పాపులర్ కంపెనీల ఐపీఓలు త్వరలో ఇన్వెస్టర్ల ముందుకొచ్చే అవకాశం ఉంది. పార్లే, రత్నదీప్, కార్ల్స్‌బర్గ్ కంపెనీలు ఐపీఓకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయి. బిస్కెట్లు, చాక్లెట్ల వంటివి తయారు చేసే పార్లే ప్రొడక్ట్స్‌ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా దాదాపు రూ.9,500 కోట్లు సేకరించాలని చూస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూ సక్సెస్ అయితే కంపెనీ మార్కెట్ వాల్యూ 10.5 బిలియన్ డాలర్లు (రూ. లక్ష కోట్లను) దాటుతుందని అంచనా.
2025 బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా 500 రిపోర్ట్ ప్రకారం, చౌహాన్ కుటుంబానికి చెందిన పార్లే రూ. 75,420 కోట్ల వాల్యుయేషన్‌తో దేశంలోనే ఏడవ అత్యంత విలువైన అన్‌లిస్టెడ్ (లిస్ట్ కాని) కంపెనీగా నిలిచింది. ఎఫ్‌ఎంసీజీ సెగ్మెంట్‌లో బ్రిటానియా (రూ. 1.29 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్), ఐటీసీ (సన్‌ఫీస్ట్), మోండెలెజ్ వంటి దిగ్గజ సంస్థలతో బలమైన పోటీపడుతోంది. ఐపీఓ కోసం కంపెనీ కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్ సంస్థలను సలహాదారులుగా ఎంపిక చేసుకుందని సంబంధిత వ్యక్తులు తెలిపారు.
త్వరలోనే మరో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌ను కూడా చేర్చుకునే అవకాశం ఉందన్నారు. పార్లే మాత్రం ఐపీఓ వార్తలను కొట్టిపారేసింది. పార్లే ప్రొడక్ట్స్ ముంబై ప్రధాన కేంద్రంగా 1929లో ప్రారంభమైంది. దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన పార్లే-జి, మెలోడీ, మ్యాంగో బైట్, క్రాక్‌జాక్, మొనాకో, హైడ్ అండ్ సీక్ వంటి బ్రాండ్లను నిర్వహిస్తోంది.
ఆర్థిక సంవత్సరం 2024-–25 లో కంపెనీ ఆపరేటింగ్ రెవెన్యూ 8.5శాతం పెరిగి రూ. 15,568.49 కోట్లకు చేరింది. అయితే, లాభం మాత్రం 39శాతం క్షీణించి రూ. 979.53 కోట్లుగా నమోదైంది. కాగా, బెవరేజ్ రంగంలో ఫ్రూటీ, అప్పీ ఫిజ్ వంటి బ్రాండ్లను నిర్వహిస్తున్న పార్లే ఆగ్రో సంస్థతో వీరికి సంబంధం లేదు. కుటుంబ విభజన తర్వాత రెండు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయి.
కార్ల్స్‌బర్గ్.. రూ.6,600 కోట్లు
గ్లోబల్ బీర్ తయారీ కంపెనీ కార్ల్స్‌బర్గ్ తన ఇండియా బిజినెస్ యూనిట్‌ను మార్కెట్‌లో లిస్ట్ చేయాలని చూస్తోంది. ఇందుకోసం కార్ల్స్‌బర్గ్ ఇండియా ఐపీఓ పేపర్లను రహస్య మార్గంలో ఫైల్ చేసింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సుమారు $700 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 6,600 కోట్లు) సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ ఇష్యూ ఈ ఏడాది చివర్లోనే వచ్చే అవకాశం ఉంది. ఇండియా బీర్ మార్కెట్‌లో కార్ల్స్‌బర్గ్‌కు సుమారు 22శాతం మార్కెట్ వాటా ఉంది.
