Cristiano Ronaldo: క్రొయేషియాతో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ గోన్సాలో రామోస్ హెడర్ ద్వారా అందించిన అద్భుత గోల్‌తో పోర్చుగల్ వరల్డ్ కప్ లాస్ట్ 16 (ప్రీ-క్వార్టర్స్)లోకి దూసుకెళ్లింది. టొరంటోలో జరిగిన ఈ మ్యాచ్‌లో క్రొయేషియా జట్టుకే ఎక్కువ గోల్స్ చేసే అవకాశాలు లభించాయి. స్టాపేజ్ టైమ్ నాల్గో నిమిషంలో రాఫెల్ లెయావో అందించిన అద్భుతమైన పాస్‌ను రామోస్ గోల్‌గా మలిచి క్రొయేషియా ఆశలపై నీళ్లు చల్లాడు. మ్యాచ్ చివరి సెకన్లలో క్రొయేషియా ప్లేయర్ జోస్కో గార్డియోల్ ఒక గోల్ చేసి మ్యాచ్‌ను సమం చేసినట్లు అనిపించినా, అంపైర్ దానిని ఆఫ్‌సైడ్ గా ప్రకటించడంతో గోల్ రద్దయింది. ఈ నిర్ణయంతో క్రొయేషియా ఆటగాళ్లు షాక్‌కు గురికాగా, పోర్చుగల్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.
రోనాల్డో సరికొత్త రికార్డు:
ఈ విజయంలో పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో కీలక పాత్ర పోషించాడు. క్రొయేషియా ప్లేయర్ ఇవాన్ పెరిసిక్ కొట్టిన తొలి గోల్‌ను రోనాల్డో పెనాల్టీ ద్వారా సమం చేశాడు. వరల్డ్ కప్ నాకౌట్ దశలో రోనాల్డోకు ఇదే మొట్ట మొదటి గోల్ కావడం విశేషం. ఈ విజయంతో అతని అంతర్జాతీయ కెరీర్‌లో మరో సరికొత్త అధ్యాయం చేరినట్లయింది. సోమవారం డల్లాస్‌లో జరిగే తదుపరి మ్యాచ్‌లో పోర్చుగల్.. స్పెయిన్‌తో తలపడనుంది.
మ్యాచ్ హైలైట్స్:
53వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు పెరిసిక్.. పోర్చుగల్ గోల్‌కీపర్ డియోగో కోస్టా క్రింద నుంచి బంతిని పంపి మొదటి గోల్ సాధించాడు. దీనికి సమాధానంగా రోనాల్డో ఒక లాంగ్ పాస్‌ను నియంత్రించి బంతిని నెట్‌లోకి పంపినప్పటికీ, అది ఆఫ్‌సైడ్‌గా తేలడంతో గోల్ ఇవ్వలేదు. పోర్చుగల్ ఆటగాడు రెనాటో వీగాను క్రొయేషియాకు చెందిన నికోలా వ్లాసిక్ పెనాల్టీ ఏరియాలో అడ్డుకోవడంతో, VAR పరిశీలన తర్వాత రెఫరీ పోర్చుగల్‌కు పెనాల్టీ ఇచ్చాడు. దీనిని రోనాల్డో గోల్ పోస్ట్ మధ్యలోకి కొట్టి స్కోరును సమం చేశాడు. మాంచెస్టర్ సిటీ ఫార్వర్డ్ ప్లేయర్ మాటెయో కోవాసిచ్ కొట్టిన లో-షాట్‌ను కీపర్ కోస్టా తన వేలికొనలతో అద్భుతంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత క్రొయేషియా ఆటగాడు పేటా సుసిక్ గోల్ చేసినా, అది కూడా ఆఫ్‌సైడ్ కిందే నిలిచింది. 81వ నిమిషంలో రోనాల్డో స్థానంలో రూబెన్ నెవెస్ మైదానంలోకి వచ్చాడు. ఆ తర్వాత కూడా క్రొయేషియాకు మంచి అవకాశాలు వచ్చాయి. మారియో పసాలిచ్ కొట్టిన హెడర్ తృటిలో పోస్ట్‌కు వెలుపలగా వెళ్ళింది.
