- ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
హసన్‌పర్తి, వెలుగు: ప్రేమ వివాహంపై కక్ష పెంచుకుని ఒకే కుటుంబానికి చెందిన వారిపై హత్యాయత్నానికి పాల్పడటంతో పాటు వారి ఇంటికి నిప్పంటించిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు హసన్‌పర్తి సీఐ మహేందర్ తెలిపారు. సీఐ వివరాల ప్రకారం.. హసన్‌పర్తి మండలం పెంబర్తి గ్రామానికి చెందిన సౌరమ్ విష్ణువర్ధన్, గుండ్ల సింగారం గ్రామానికి చెందిన కరిష్మా జూన్ 24న ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఈ వివాహంపై ఆగ్రహంతో యువతి కుటుంబ సభ్యులు, వారి అనుచరులు మరుసటి రోజు రాత్రి విష్ణువర్ధన్ ఇంటికి వెళ్లి కత్తులతో బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం జూన్ 26 తెల్లవారుజామున 4 గంటల సమయంలో విష్ణువర్ధన్, కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా ఇంటి తలుపులు, కిటికీలపై డీజిల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బాధితులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడగా, సుమారు రూ.లక్ష మేర ఆస్తినష్టం జరిగింది.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి గాదే ఇజిక్యపాల్(19), గుగులోతు మనోజ్ నాయక్(18)ను అరెస్ట్ చేశారు. వారి వద్ద దొంగిలించిన బైక్‌తో పాటు తల్వార్, వ్యవసాయ కొడవలి, పెద్ద కర్ర దుడ్డు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
