- విదేశీ కొలువులకు 4,200 మంది ప్రైమరీ సెలక్షన్
- 1,750 మందికి లోకల్ జాబ్స్..
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ నగరంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి జాబ్ మేళాకు యువత నుంచి భారీ స్పందన లభించింది. సిటీలోని జనార్ధన్ ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటలకే వేలాదిగా యువత విద్యార్హత సర్టిఫికెట్లతో తరలివచ్చి క్యూల్లో నిలబడ్డారు. అధికారులు పేర్లను నమోదు చేసి మొత్తం 7,500 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు.
లోకల్ ఉద్యోగాలతో పాటు విదేశీ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న వారి వివరాలను కూడా సేకరించి, అర్హతల ఆధారంగా ఎంపికలు చేపట్టారు. టెక్నికల్ కోర్సులు చేయని వారినీ పరిగణనలోకి తీసుకుని, వారికి ఉచిత శిక్షణతో పాటు వసతి కల్పించనున్నారు. ఉపాధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, టామ్‌కామ్ సహకారంతో ఈ మేళా నిర్వహించగా పలు కంపెనీల ప్రతినిధులు సెలెక్షన్ ప్రక్రియలో పాల్గొన్నారు.
అంచనాలకు మించి హాజరు..
జిల్లా ఉపాధి శాఖ అధికారి వేల్పుల విజేత వారం రోజులుగా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయడంతో మేళాకు ఊహించిన దానికంటే రెట్టింపు సంఖ్యలో యువత తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు రిజిస్ట్రేషన్ కొనసాగగా, ఇంటర్వ్యూలు రాత్రి 8 గంటల వరకు సాగాయి. డిగ్రీ, పీజీ, బీటెక్, ఫార్మసీ, ఎంబీఏ, ఐటీఐ, డిప్లొమా, 10వ తరగతి, 8వ తరగతి అర్హతలతో వచ్చిన వారందరికీ అవకాశమిచ్చారు.
విదేశీ ఉద్యోగాల కోసం 4,200 మందిని ప్రాథమికంగా ఎంపిక చేశారు. వీరిలో దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేయాలనుకునే అభ్యర్థులను ఈ నెల 6న హైదరాబాద్‌లో జరిగే తదుపరి ఇంటర్వ్యూకు రావాలని సూచించారు. లోకల్ ఉద్యోగాల కోసం 1,750 మందిని ఎంపిక చేసి, అక్కడికక్కడే అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందజేశారు.
పలు కంపెనీల నుంచి ఆఫర్లు..
అపోలో ఫార్మసీ, లార్సెన్ అండ్ టాబ్రో, మేధా సర్వో డ్రైవ్స్ తదితర సంస్థలు జాబ్‌మేళాలో పాల్గొన్నాయి. ముఖ్యంగా లార్సెన్ అండ్ టర్బో సంస్థ అనుభవంలేని యువతకు ఉచిత వసతితో కార్పెంటర్, మేసన్, వెల్డింగ్, ప్లంబింగ్ వంటి టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉపాధి, శిక్షణ శాఖ రాష్ట్ర డైరెక్టర్ కాంతి వెస్లీ తెలిపారు.
గవర్నమెంట్ ఆలోచనలకు అనుగుణంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పలు దేశాలతో ఎంఓయూలు చేయించారన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, పాస్‌పోర్ట్ లేక మేళాకు వచ్చిన వారికి మరో అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, మేయర్ ఉమారాణి, డిప్యూటీ మేయర్ సల్మా తహ్‌సిన్ తదితరులు పాల్గొన్నారు.
