కీవ్‌‌‌‌‌‌‌‌పై మిసైల్స్, డ్రోన్లతోరష్యా భీకర దాడి..11 మంది మృతి, 54 మందికి గాయాలు

కీవ్‌‌‌‌‌‌‌‌పై మిసైల్స్, డ్రోన్లతోరష్యా భీకర దాడి..11 మంది మృతి, 54 మందికి గాయాలు
  • కీవ్‌‌‌‌‌‌‌‌లోని 30 ప్రాంతాల్లో భారీ విధ్వంసం.. దెబ్బతిన్న 20 బిల్డింగ్స్ 

కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌‌‌‌‌‌‌‌పై రష్యా మరోసారి మిసైల్స్, డ్రోన్లతో భారీ దాడికి పాల్పడింది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ భీకర దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 54 మంది గాయపడ్డారు. కీవ్‌‌‌‌‌‌‌‌లోని అనేక ప్రాంతాల్లో నివాస భవనాలు, హోటళ్లు, ఇతర పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. రష్యా బుధవారం అర్ధరాత్రి తర్వాత కీవ్‌‌‌‌‌‌‌‌పై బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో ఈ దాడి చేసింది. గంటల తరబడి నగరంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌‌‌‌‌‌‌‌స్కీతో పాటు అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేయడంతో చాలామంది మెట్రో స్టేషన్లలోకి వెళ్లి ఆశ్రయం పొందారు.

ఈ దాడిలో 11 మంది మరణించారని, 54 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఇహోర్ క్లైమెంకో తెలిపారు. నగరంలోని 30 ప్రాంతాల్లో నష్టం జరిగిందని కీవ్ సిటీ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ టిమూర్ ట్కాచెంకో చెప్పారు. ఇండ్లు, పౌర మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు జరిగాయని, 20 బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌ దెబ్బతిన్నాయని తెలిపారు. సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.