అమెరికాకు చెందిన మెడికల్ కోడింగ్ కంపెనీ CorroHealth తీసుకున్న ఆకస్మిక నిర్ణయం కేరళలో తీవ్ర కలకలం రేపింది. కొచ్చి, కోజికోడ్ ఆఫీసులను సడెన్ గా మూసేస్తున్నట్లు ప్రకటించడంతో దాదాపు 900 మంది ఉద్యోగులు ఒకేరోజు రోడ్డున పడ్డ పరిస్థితి ఎదురైంది. ఉదయం షిఫ్ట్‌కు వచ్చిన ఉద్యోగులకు గేట్ల వద్దే ఆపేయటంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
ఆఫీసులోకి వెళ్లిన ఉద్యోగులను బయటకు పంపించి, ఐడీ కార్డులు సమర్పించాలని, రిలీవింగ్ లెటర్లు తీసుకుని వెళ్లిపోవాలని కంపెనీ ప్రతినిధులు చెప్పినట్లు ఉద్యోగులు ఆరోపించారు. కంపెనీ 3 నెలల జీతాన్ని పరిహారంగా ఇస్తామని చెప్పడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కనీసం 10 నెలల సెవరెన్స్ ప్యాకేజ్ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
కంపెనీ కేరళలో కార్యకలాపాలు నిలిపివేస్తున్నామని చెప్పినప్పటికీ.. మరోవైపు హైదరాబాద్‌లో కొత్త రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయని ఉద్యోగులు ఆరోపించడం వివాదాన్ని మరింత పెంచింది. ఒక ప్రాంతంలో ఉద్యోగాలు తొలగించి, మరో ప్రాంతంలో జాబ్ రిక్రూట్మెంట్స్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానిక ఎమ్మెల్యే ఉమా థామస్, మంత్రి సన్నీ జోసెఫ్, లేబర్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులు కంపెనీ ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
ALSO READ : దేశంలోకి కొత్త గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్..
చర్చల తర్వాత కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులు యథావిధిగా పనికి హాజరుకావచ్చని.. శాలరీ, ఇతర సౌకర్యాల్లో ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల్లో కొంత ఊరట కనిపించింది. అయితే కంపెనీ కేరళ కార్యకలాపాల భవిష్యత్తుపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని తెలిపింది. తదుపరి చర్చల తర్వాతే పూర్తి స్థాయి నిర్ణయం వెలువడనుందని వెల్లడించింది.
