వైరల్ సక్సెస్ స్టోరీ: ఒకప్పుడు జొమాటో డెలివరీ బాయ్.. ఇప్పుడు 2 ఏఐ స్టార్టప్ కంపెనీలకు ఓనర్

వైరల్ సక్సెస్ స్టోరీ: ఒకప్పుడు జొమాటో డెలివరీ బాయ్.. ఇప్పుడు 2 ఏఐ స్టార్టప్ కంపెనీలకు ఓనర్

జీవితంలో అవకాశాలు ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలియదు. వాటిని పట్టుకుని ముందుకు వెళ్లే ధైర్యం ఉంటే చాలు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 28 ఏళ్ల సూరజ్ బిశ్వాస్ అందుకు ఉదాహరణ. ఒకప్పుడు జొమాటో డెలివరీ బాయ్‌గా రోజుకు రూ.1,000 నుంచి రూ.1,500 సంపాదించిన ఈ యువకుడు.. ఇప్పుడు రెండు AI స్టార్టప్‌లకు వ్యవస్థాపకుడు, సీఈఓగా ఎదిగాడు.

నదియా జిల్లాలోని చిన్న పట్టణం చక్దహా నుంచి వచ్చిన సూరజ్.. డాక్టర్ కావాలనేది తన కల. కోల్‌కతాలో జెనెటిక్స్‌లో బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత పరిస్థితుల కారణంగా ఆ కల నెరవేరలేదు. జీవనోపాధి కోసం జొమాటోలో డెలివరీ పార్ట్‌నర్‌గా చేరాడు. అయితే ఆ ఉద్యోగాన్ని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. ఆ రోజులు తనకు గర్వకారణమని ఇప్పటికీ చెబుతుంటాడు.

ఒక ఆలోచనే జీవితాన్ని మార్చేసింది
డెలివరీ చేస్తూనే విద్యా వ్యవస్థను దగ్గరగా గమనించాడు. ప్రతి విద్యార్థి ఒకే విధంగా నేర్చుకోలేడనే విషయం అతడిని తీవ్రంగా ఆలోచింపజేసింది. అదే ఆలోచన AI ఆధారిత స్టార్టప్‌కు బీజం వేసింది. ప్రతి వ్యక్తి సామర్థ్యాన్ని అర్థం చేసుకునే సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 2021లో ఎలాంటి పెట్టుబడులు, కో-ఫౌండర్ లేకుండానే Assessli అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు. తర్వాత Dots-in అనే మరో AI కంపెనీని కూడా స్థాపించాడు.

ఎదుగుదల అంత ఈజీ కాదు..
చిన్న పట్టణం నుంచి వచ్చాడని, పెద్ద కాలేజీలో చదవలేదని, డెలివరీ బాయ్‌గా పనిచేశాడని చాలా మంది అతని ఆలోచనలను మొదట సీరియస్‌గా తీసుకోలేదు. నిధుల కొరత కూడా పెద్ద సవాలే. అయినా తన కలను వదలకుండా పరిశోధనలు కొనసాగించాడు. ఇప్పటివరకు రెండు రీసెర్చ్ డాక్యుమెంట్స్ కూడా ప్రచురించాడు.

తండ్రి కోసం.. సమాజం కోసం
సూరజ్ జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన 2024లో జరిగింది. ఇంటికి రంగులు వేసే పనితో కుటుంబాన్ని పోషించిన తండ్రి.. తన కుమారుడి విజయం పూర్తిగా చూడకముందే కన్నుమూశారు. ఆ బాధనే తనకు మరింత బలంగా మార్చుకున్న సూరజ్.. Indots పేరుతో లాభాపేక్షలేని సంస్థను ప్రారంభించి, పేద పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాడు.

ALSO READ : ఒక్క క్లిక్‌తో ఈ-రిక్షా బంద్? BAT-BMS యాప్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం

మీ బ్యాగ్రౌండ్ మీ భవిష్యత్తును నిర్ణయించదు. భయం ఉన్నా ముందుకు నడిచే ధైర్యమే విజయాన్ని అందిస్తుందని సూరజ్ చెప్పే మాటలు నేటి యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తున్నాయి. డెలివరీ బాయ్‌గా మొదలైన అతని ప్రయాణం.. ఇప్పుడు ప్రపంచానికి AI రంగంలో కొత్త దిశ చూపించే స్థాయికి చేరుకోవడం నిజంగా అసాధారణమైన జర్నీకి నిదర్శనం. సరైన సమయం కోసం వేచిచూడటం కంటే కలలను చేరుకునే ప్రయాణాన్ని స్టార్ట్ చేయటం ముఖ్యం అంటున్నాడు ఈ కుర్ర సీఈఓ.