12వేల కి.మీ తిరగ్గానే కొత్త ఇన్నోవా బ్రేక్‌డౌన్.. E20పై గడ్కరీని పొట్టుపొట్టు తిట్టిన ఓనర్

12వేల కి.మీ తిరగ్గానే కొత్త ఇన్నోవా బ్రేక్‌డౌన్.. E20పై గడ్కరీని పొట్టుపొట్టు తిట్టిన ఓనర్

కొత్త కారు కొంటే లక్షల కిలోమీటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణిస్తుందని ఓనర్స్ అనుకుంటారు. అయితే జస్ట్ 12 వేల కిలోమీటర్లు మాత్రమే నడిచిన ఓ కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ పెద్ద లోపానికి గురవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో E20 పెట్రోల్ భద్రత, ఇంజిన్ పనితీరుపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది.

బీహార్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్, జర్నలిస్టు మనీష్ కశ్యప్ తన కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ కేవలం 12వేల కిలోమీటర్లు మాత్రమే నడిచిన తర్వాత ఇంజిన్‌లో తీవ్రమైన సమస్యలు వచ్చాయని ఆరోపించాడు. తన వాహనం పూర్తిగా E20 కంపాటిబుల్ అని కంపెనీ చెప్పి విక్రయించినప్పటికీ, వాస్తవానికి ఇథనాల్ మిక్స్డ్ పెట్రోల్ కారణంగానే ప్రస్తుతం బ్రేక్ డౌన్ అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కారు కొన్న సమయంలో 2 లక్షల కిలోమీటర్ల వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా తీసుకున్నానని మనీష్ కశ్యప్ చెప్పారు. అయినప్పటికీ ఇంజిన్ రిపేర్లను వారంటీ కింద చేయడానికి టయోటా నిరాకరించిందని ఆరోపించాడు. దీంతో లక్షల రూపాయల ఖర్చు తనపైనే పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

అంతేకాదు సర్వీస్ సెంటర్ సిబ్బంది కూడా కెమెరా ముందే ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్ వల్లే ఇంజిన్ పాడయ్యే అవకాశం ఉందని చెప్పారని మనీష్ కశ్యప్ వెల్లడించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా వాహనదారుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఘటన తర్వాత మనీష్ కశ్యప్ కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీపై కూడా తీవ్ర విమర్శలు చేశాడు. దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌ను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. దాని వల్ల వాహనాలకు నష్టం జరిగితే బాధ్యత ఎవరిది అని ప్రశ్నించాడు. E20 వల్ల సమస్యలు వస్తే వాహన యజమానులకు రక్షణ కల్పించే స్పష్టమైన విధానం ఎందుకు లేదని నిలదీశాడు.

కేంద్ర ప్రభుత్వం మాత్రం E20 పెట్రోల్ వినియోగాన్ని పెంచడం వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గుతాయని, రైతులకు ఇథనాల్ ఉత్పత్తి ద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని చెబుతోంది. కానీ వాహన యజమానులు, మెకానిక్‌లు మాత్రం E20 వల్ల మైలేజ్ తగ్గడం, పనితీరు పడిపోవడం, ఇంజిన్ విడిభాగాలు త్వరగా దెబ్బతింటున్నాయని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇవేవీ తమకు వినిపించనట్లు అంతా ఆల్ రైట్ అంటూ ముందుకెళుతోంది. ఇటీవల కోర్టులో కూడా ఇథనాల్ పెట్రోల్ పై దేశంలో అందరిపై వాడి స్టడీ చేస్తున్నామని వచ్చే సంవత్సరం ఫలితాలు వస్తాయంటూ బదులిచ్చి చేతులు దులిపేసుకుంది. 

ALSO READ : ఒకప్పుడు జొమాటో డెలివరీ బాయ్.. ఇప్పుడు 2 ఏఐ స్టార్టప్ కంపెనీలకు ఓనర్

అయితే ఈ ఘటనపై టయోటా నుంచి అధికారిక సాంకేతిక నివేదిక ఇంకా బయటకు రాలేదు. ఇంజిన్ లోపానికి నిజంగా E20 పెట్రోల్‌నే కారణమా? లేక మరేదైనా సాంకేతిక సమస్య ఉందా? అనేది స్పష్టంగా తేలాల్సి ఉంది. కానీ "E20 Compatible" అని కంపెనీలు చెబుతున్న వాహనాలు నిజంగా దీర్ఘకాలం E20 పెట్రోల్ ను తట్టుకుంటాయా? అనే ప్రశ్న మాత్రం ఎవ్వరూ బదులివ్వలేక పోవటం వాహనాల ఓనర్లను ఆందోళనకు గురిచేస్తోంది.