జూన్ నెలలో తిరుమలకు పోటెత్తిన భక్తులు.. రికార్డు స్థాయిలో 1.27 కోట్ల లడ్డూల విక్రయం

జూన్ నెలలో తిరుమలకు పోటెత్తిన భక్తులు.. రికార్డు స్థాయిలో 1.27 కోట్ల లడ్డూల విక్రయం

వేసవి సెలవులు ముగుస్తుండటం, స్కూళ్లు ప్రారంభం అయ్యే సందర్భంగా జూన్ నెలలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి రికార్డు స్థాయిలో లడ్డూ అమ్మకాలు జరిగినట్లు టీటీడీ శుక్రవారం (జులై 03) ఒక ప్రకటనలో తెలిపింది. 

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో  శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. లడ్డూ ప్రసాదం విక్రయాలు  జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భక్తుల రద్దీ పెరిగిన క్రమంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని కూడా విస్తృతంగా పెంచి, ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అందిస్తోంది.

2026  ఏప్రిల్ నెలలో కోటి 11 లక్షల 96 వేల170 లడ్డూల అమ్మకాలు జరిగాయి.  మే నెలలో కోటి 21 లక్షల35 వేల528 లడ్డూలు అమ్ముడయ్యాయి. ఇక జూన్ నెలలో గత అమ్మకాలతో పోల్చితే భారీ స్థాయిలో శ్రీవారి లడ్డూలు అమ్ముడయ్యాయి. జూన్ లో కోటి 26 లక్షల 81వేల 805 లడ్డూలు విక్రయమయ్యాయి. గత మూడు నెలలతో పోలిస్తే ఈ జూన్ నెలలో లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయి.

►ALSO READ | కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ పై బూడిద,ఎముకలు... సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో షాకింగ్ విషయాలు..

2024 జూన్ నెలలో కోటి 2 లక్షల  64 వేల364 లడ్డూలు, 2025 జూన్ నెలలో కోటి 19 లక్షల 21 వేల353 లడ్డూలు విక్రయాలు జరగగా, 2026 జూన్ నెలలో  కోటి 26 లక్షల 81 వేల805 లడ్డూలు విక్రయించడం విశేషం. అంటే గత ఏడాది జూన్‌తో పోలిస్తే 7 లక్షల 59 వేల 452 లడ్డూలు అధికంగా విక్రయించారు.  అంటే 6.37 శాతం వృద్ధి నమోదైంది. అలాగే 2024తో పోలిస్తే 24 లక్షల17 వేల 441 లడ్డూలు అధికంగా విక్రయమవ్వగా 23.55 శాతం వృద్ధి నమోదైంది.