పూణేలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ పోలీసుల కస్టడీలో ఉండగా మీడియా వైపు మధ్య వేలు చూపించడం తీవ్ర సంచలనంగా మారింది. కాబోయే భర్తను ప్లాన్ చేసి.. ప్రియుడితో కలిసి చంపిన 23 ఏళ్ల యువతి ఈ సియా గోయల్. ఒక తీవ్రమైన నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి నుంచి సాధారణంగా కనిపించే పశ్చాత్తాపం, భయం వంటి భావాలు కాకుండా, ఇలాంటి ప్రవర్తన రావడం వెనక ఉన్న సైకలాజికల్ అనాలిసిస్ ఇది.
పశ్చాత్తాపం లేకపోవడం :
సైకాలజీ ప్రకారం, ఒక ఘోరమైన నేరం చేసిన తర్వాత కూడా ఎటువంటి తప్పు చేశాననే భావన లేకపోవడాన్ని ఇది సూచిస్తుంది. తన చర్యల వల్ల ఒకరి ప్రాణం పోయిందనే కనీస బాధ లేదా పశ్చాత్తాపం లేకపోవడం, ఆమె మానసిక స్థితిలోని తీవ్రమైన కఠినత్వాన్ని లేదా భావోద్వేగ రహిత స్వభావాన్ని చూపిస్తుంది.
ధిక్కార వైఖరి, అహంకారం :
సమాజం, చట్టం, మీడియా పట్ల ఉన్న తిరస్కార భావాన్ని ఈ సంకేతం వ్యక్తపరుస్తుంది. "నన్ను ఎవరూ ఏమీ చేయలేరు".. "మీకు నన్ను ప్రశ్నించే అర్హత లేదు" అనే ఒక రకమైన అహంకారపూరిత వైఖరి ఇందులో కనిపిస్తుంది. మీడియా తనను టార్గెట్ చేస్తోందనే కోపాన్ని ఆమె ఈ విధంగా ప్రదర్శించి ఉండవచ్చు.
సామాజిక నిబంధనలపై నిర్లక్ష్యం :
సాధారణంగా సమాజంలో నేరానికి గురైన వారు లేదా నిందితులు తలదించుకోవడం చూస్తుంటాం. ఇక్కడ వ్యతిరేకంగా ప్రవర్తించడం అనేది యాంటీ- సోషల్ పర్సనాలిటీ ట్రెయిట్స్ లో భాగం కావచ్చు. సమాజం విధించే నైతిక నియమాలను, చట్టపరమైన భయాన్ని పూర్తిగా పక్కన పెట్టే మనస్తత్వం ఇది.
రక్షణ యంత్రాంగం :
లోపల భయం, ఆందోళన ఉన్నప్పటికీ.. దానిని కప్పిపుచ్చుకోవడానికి కొంత మంది "ఆక్రోశం" లేదా "సవాలు" చేసే ప్రవర్తనను ప్రదర్శిస్తారు దీన్నే Reactions formation అంటారు. మీడియా ముందు తను బలహీనంగా కనిపించకూడదనే ఉద్దేశంతో ఒక విధమైన నకిలీ ధైర్యాన్ని లేదా మొండితనాన్ని చూపించడానికి కూడా ఇలా చేసి ఉండవచ్చు.
ALSO READ : సింధు జలాల ఒప్పందంపై వెనక్కి తగ్గేది లేదు..
ఈ ప్రవర్తన మొత్తం ఆమె వ్యక్తిత్వంలో ఉన్న తీవ్రమైన మొండితనాన్ని, చట్టం పట్ల ఉన్న బేఖాతరును స్పష్టం చేస్తోంది అని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇలాంటి మనస్తత్వం నేటి యువతలో పెరుగుతుందని.. అందుకు నిదర్శనమే ఎన్నడూ లేనటువంటి ఘోరాలు చూస్తున్నాం అంటున్నారు. మొన్నటికి మొన్న హనీమూన్ లో భర్తను చంపటం, తల్లి దండ్రులను చంపటం.. చిన్న కారణాలకే గొడవలు, హత్యలు అని చెబుతున్నారు. సోషల్ మీడియాతోపాటు OTTల్లో వస్తున్న క్రైం థ్రిల్లర్ స్టోరీల ప్రభావం నేటి యువతపై తీవ్రంగా ఉంటుందనటానికి ఇదో ఎగ్జాంపుల్ గా చెబుతున్నారు సైకాలజిస్టులు.
-B .కృష్ణ భరత్, సీనియర్ సైకాలజిస్ట్
