ఐఐటి బొంబాయి (IIT Bombay) విద్యార్థి సాహిల్ రవీంద్ర వాకోడే (22) ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. క్యాంపస్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో, యాజమాన్యం దిగివచ్చింది. విద్యార్థి వ్యవహారాల డీన్ (Dean of Student Affairs) ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లాను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ఐఐటి బొంబాయి డైరెక్టర్ శిరీష్ బి. కేదారే ప్రకటించారు. విచారణ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.
ఈ ఘటనపై ఐఐటి బొంబాయి యాజమాన్యం బహిరంగ క్షమాపణలు చెప్పడమే కాకుండా, మొదట్లో విద్యార్థి మరణానికి సంబంధించిన పరిస్థితులను తప్పుగా చిత్రీకరించినందుకు విచారం వ్యక్తం చేసింది.
అసలు ఏం జరిగిందంటే ?
మహారాష్ట్రలోని యవత్మల్ జిల్లాకు చెందిన సాహిల్ వాకోడే, ఐఐటి బొంబాయిలోని 'ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్' విభాగంలో బిటెక్ సెకండియర్ చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం పోవై (Powai) క్యాంపస్‌లోని తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు.
ఆత్మహత్యకు కొన్ని గంటల ముందు, మిడ్-సెమిస్టర్ పరీక్షలో సాహిల్ మొబైల్ ఫోన్ వాడుతూ, చాట్‌జిపిటి (ChatGPT) ద్వారా ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ పట్టుబడ్డాడనే ఆరోపణలు వచ్చాయి.
కుటుంబం, విద్యార్థుల ఆరోపణలు
సాహిల్ కుటుంబికులు సహా క్యాంపస్‌లోని విద్యార్థులు అతని మృతిని తీవ్రంగా ఖండించారు. సాహిల్ సంస్థ వేధింపులు, కుల వివక్ష (SC/ST discrimination) ఎదుర్కొన్నాడని ఆరోపించారు.
ALSO READ : వినాయకుడు పాలు తాగుతున్నాడు కథకు 31 ఏళ్లు
పరీక్షలో పట్టుబడిన తర్వాత ప్రొఫెసర్లు తీవ్ర ఒత్తిడికి గురిచేశారని, చదువు నుంచి సస్పెండ్ చేస్తామని బెదిరించడం వల్లే సాహిల్ మానసిక ప్రశాంతత కోల్పోయి ఈ దారుణానికి ఒడిగట్టాడని తోటి విద్యార్థులు పేర్కొన్నారు.
సాహిల్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు బుక్ చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గాను ఒక ప్రొఫెసర్‌ను నిందితుడిగా చేర్చి, కేసు విచారణను క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు.
అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన – ఒప్పుకున్న యాజమాన్యం
ఈ ఘటనకు నిరసనగా సెప్టెంబర్ 20న అర్ధరాత్రి వందల మంది విద్యార్థులు ఐఐటి బొంబాయి మెయిన్ గేట్ వద్ద తీవ్ర నిరసన చేపట్టారు. పరిస్థితి చేయిదాటడంతో డైరెక్టర్ శిరీష్ కేదారే స్వయంగా వచ్చి విద్యార్థులతో మూడు గంటల పాటు చర్చలు జరిపారు.
నిరసనకారులు ప్రొఫెసర్ సస్పెన్షన్, స్వతంత్ర కమిటీతో విచారణ, బహిరంగ క్షమాపణ, బాధితుడి కుటుంబానికి పరిహారం సహా 18 డిమాండ్లను ముందు ఉంచగా.. వాటన్నింటికీ యాజమాన్యం అంగీకరించింది.
ఫ్యాకల్టీ ఫోరమ్ మద్దతు
మరోవైపు, ఐఐటి బొంబాయి ఫ్యాకల్టీ ఫోరమ్ నిందితుడైన ప్రొఫెసర్‌కు మద్దతుగా నిలిచింది. కాపీయింగ్ జరిగినప్పుడు ఇన్స్టిట్యూట్ నిబంధనల ప్రకారమే ప్రొఫెసర్ విధులను నిర్వర్తించారని, సాహిల్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి భవిష్యత్తుపై భయం లేకుండా హామీ ఇచ్చారని ఫ్యాకల్టీ ఫోరమ్ పేర్కొంది.
