న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సెప్టెంబర్ 23న విచారణ జరగనుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరారు.
దానం పిటిషన్‌ను సోమవారం (సెప్టెంబర్ 21) సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు స్పెషల్ మెన్షన్ చేశారు ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి. తెలంగాణ హైకోర్టు ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్లు ప్రకటించిందని పేర్కొంటూ దానం పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించాలని కోరారు. తన క్లయింట్ పిటిషన్‌పై విచారణ ఆలస్యమైతే ఉప ఎన్నిక నోటిషికేషన్ వెలువడే అవకాశం ఉందని వాదించారు.
దానం పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించారు. మరోవైపు.. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేవియట్ దాఖలు చేశారు. తమ వాదనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో దానం నాగేందర్ పిటిషన్‌పై సెప్టెంబర్ 23వ తేదీకి విచారణ వాయిదా వేసింది. దీంతో సుప్రీం కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
దానంపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు:
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఆయనపై అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ వెలువరించిన తీర్పును కొట్టివేసింది.రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2), పదో షెడ్యూల్లోని 2(1)(ఎ) ప్రకారం.. దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23 నుంచే శాసనసభ సభ్యుడిగా అనర్హుడని ప్రకటించింది.
అదే తేదీన దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫారం తీసుకుని సికింద్రాబాద్ పార్లమెంటు సీటుకు నామినేషన్ వేశారని, బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టేనని స్పష్టం చేసింది.
దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు ప్రకటించింది. స్పీకర్ కార్యదర్శికి, కేంద్ర ఎన్నికల సంఘానికి తీర్పు ప్రతులను పంపించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ తో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది.
