ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ సంస్థపై సీబీఐ కొరడా ఝుళిపించింది. LIC ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రిలయన్స్ క్యాపిటల్, దాని మాజీ చైర్మన్ అనిల్ అంబానీ, గ్రూప్ ఎండీ సతీష్ సేథ్‌లతో పాటు మరికొందరిపై సీబీఐ తాజాగా FIR నమోదు చేసింది. ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడుల్లో సుమారు రూ. 2వేల 684 కోట్ల భారీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలతో ఈ హై-లెవల్ విచారణ ప్రారంభమైంది.
ఎల్ఐసీ ఫిర్యాదు ప్రకారం.. 2012 ఏప్రిల్ 12 నుంచి 2018 మార్చి 9 మధ్య కాలంలో ఈ అక్రమాలు జరిగినట్లు తేలింది. రిలయన్స్ క్యాపిటల్ జారీ చేసిన నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లలో ఎల్ఐసీ రూ. 3వేల 900 కోట్లు పెట్టుబడి పెట్టింది. కంపెనీ సాధారణ కార్పొరేట్ అవసరాలు, లోన్ చెల్లింపుల కోసం ఈ నిధులను వాడాల్సి ఉంది. అయితే నిందితులు కుట్ర పన్ని.. ఆ డబ్బును తప్పుదారి పట్టించారని, తప్పుడు లెక్కలు చూపించి ఎల్ఐసీని మోసం చేశారని ఆరోపించారు. దీనివల్ల ఎల్ఐసీకి రూ.2వేల 684 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనిల్ అంబానీ తరఫు ప్రతినిధి ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అనిల్ అంబానీ 2005 నుంచి నవంబర్ 2021 వరకు రిలయన్స్ క్యాపిటల్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్/చైర్మన్‌గా మాత్రమే పనిచేశారని, రిజర్వ్ బ్యాంక్ బోర్డును రద్దు చేసే వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారని తెలిపారు. ఈ కేసులో ఆయనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని, చట్టపరంగా అన్ని అవకాశాలను ఉపయోగించుకుని దీనిని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
ఈ గ్రూప్‌నకు సంబంధించి గతంలోనూ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఈపీఎఫ్‌ఓ, ఎల్ఐసీ ఫిర్యాదుల మేరకు సీబీఐ పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇప్పటికే కొన్ని ఛార్జ్‌షీట్‌లు కూడా దాఖలయ్యాయి. ప్రస్తుతం దర్యాప్తు అధికారులు నిధులు ఎక్కడికి మళ్లించారనే దానిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. అసలు డబ్బు ఎలా ఎవరెవరి చేతులు మారాయనే కూపీ లాగుతున్నారు.
