డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లో ప్రజాదరణ పొందిన UPI సేవల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్ 15 నుంచి యూపీఐ వ్యాపార లావాదేవీలపై 0.02 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీని అమలులోకి రానుంది. ఈ కొత్త రూల్స్ వల్ల క్యాపిటల్ మార్కెట్లు.. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకింగ్ రంగానికి చెందిన చెల్లింపులపై ప్రభావం పడనుంది. దీంతో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలపై ఛార్జీల ప్రభావం ఏ విధంగా ఉండనుందనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులపై ప్రభావం?
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఈ కొత్త MDR ఛార్జీల విషయంలో కొంత ఊరట లభించిందని చెప్పవచ్చు. సాధారణంగా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)లపై యూపీఐ ఆటోపే సేవలను ఉపయోగిస్తుంటారు. ఈ రకమైన రికరింగ్ మాండేట్‌లకు కొత్త మర్చంట్ ఎండీఆర్ ఛార్జీల నుంచి మినహాయింపు లభించింది. కాబట్టి ఎస్‌ఐపీల ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే సాధారణ ఇన్వెస్టర్లపై కొత్తగా రానున్న ఛార్జీల ప్రభావం నేరుగా ఉండదు.
అయితే ఎవరైనా ఇన్వెస్టర్లు ఒకేసారి భారీ మొత్తంలో యూపీఐ ద్వారా పెట్టుబడి పెడితే మాత్రం 0.02 శాతం చొప్పున MDR ఛార్జీ వర్తిస్తుంది. రూ.15 లక్షలకు మించి పెట్టుబడులపై గరిష్టంగా రూ.300 వరకు ఫ్లాట్ ఫీజు వసూలు చేస్తారు. దీనివల్ల వన్‌టైమ్ ఇన్వెస్ట్‌మెంట్లు చేసే వారిపై స్వల్పంగా భారం పడే అవకాశం ఉంది.
ALSO READ : ఆప్ఘానిస్తాన్పై పాకిస్తాన్ బాంబుల వర్షం.. ముగ్గురు మృతి
ఫండ్ కంపెనీల ముందున్న ఆప్షన్స్?
మ్యూచువల్ ఫండ్ కంపెనీల విషయానికి వస్తే.. తరచూ యూపీఐ లావాదేవీలు చేసే ఇన్వెస్టర్ల వల్ల ఫండ్ హౌస్‌లపై నిర్వహణ ఖర్చులు పెరిగే ప్రమాదముంది. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ ప్రతి నెలా ప్రారంభంలో రూ.లక్షను ఓవర్‌నైట్ లేదా లిక్విడ్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టి.. నెలాఖరులో దాన్ని వెనక్కి తీసుకుంటూ ఉంటే.. ప్రతిసారీ ఫండ్ హౌస్ ఈ ఛార్జీలను భరించాల్సి ఉంటుంది. ఏడాది పాటు చూస్తే ఇది జీఎస్టీతో కలిపి దాదాపు 0.29 శాతానికి చేరుకుంటుంది. వాస్తవానికి ఇది ఫండ్ కంపెనీలపై కనిపించని భారీ ఖర్చును మోపుతుంది.
ఈ అదనపు భారాన్ని భరించలేక ఫండ్ కంపెనీలు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నాయి. మొదటిగా పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం కొన్ని ఫండ్ హౌస్‌లు ఈ భారాన్ని తామే భరించి ఇన్వెస్టర్లకు ఇబ్బంది కలగకుండా చూసే అవకాశం ఉంది. రెండవ ఆప్షన్ కింద ఖర్చులు విపరీతంగా పెరిగితే.. యూపీఐకి బదులుగా నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS వంటి ఇతర సాంప్రదాయ చెల్లింపు పద్ధతులను ఉపయోగించాలని ఇన్వెస్టర్లను ప్రోత్సహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ యూపీఐ ఛార్జీల రూల్స్ అమల్లోకి వస్తే మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీల నిర్వహణ శైలిలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
